హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ వేదికగా ఈనెల 7 నుంచి మొదలయ్యే 37వ సబ్‌జూనియర్ జాతీయ హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీల బ్రోచర్‌ను రాష్ట్ర క్రీడా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సోమవారం ఆవిష్కరించారు. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంతో పాటు అక్షర ఇంటర్నేషన్ స్కూల్(ఎల్బీ నగర్) వేదికలుగా జాతీయ హ్యాండ్‌బాల్ టోర్నీ పోటీలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ ‘హైదరాబాద్‌లో జాతీయ స్థాయి టోర్నీ నిర్వహించడం ఆనందంగా ఉంది. జాతీయ, అంతర్జాతీయ టోర్నీలు నిర్వహించేందుకు రాష్ట్ర క్రీడాశాఖ ఎంతో ప్రోత్సాహం అందిస్తున్నది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ క్రీడలకు పెద్దపీట వేస్తున్నారు’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ హ్యాండ్‌బాల్ అసోసియేషన్(హెచ్ఎఫ్ఐ) అధ్యక్షుడు జగన్మోహన్రావు, సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర హ్యాండ్‌బాల్ సంఘం ప్రధాన కార్యదర్శి పవన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.