హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ సబ్‌జూనియర్ బాలుర హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్‌లో ఆతిథ్య తెలంగాణ అదిరిపోయే బోణీ కొట్టింది. శుక్రవారం జరిగిన తమ తొలి మ్యాచ్‌లో తెలంగాణ 32-11 తేడాతో మధ్యప్రదేశ్‌పై ఘన విజయం సాధించింది. ఆది నుంచే దూకుడు కనబరిచిన మన జట్టు ప్రథమార్ధం ముగిసే సరికి 18-6తో ఆధిక్యంలో నిలిచింది. అదే జోరు కొనసాగిస్తూ వరుస పాయింట్లు కొల్లగొట్టింది. ప్రత్యర్థి లోపాలను అనుకూలంగా మలుచుకుంటూ ముందుకు సాగిన తెలంగాణ భారీ తేడాతో విజయాన్ని సొంతం చేసుకుని టోర్నీలో ముందంజ వేసింది. మిగతా మ్యాచ్‌ల్లో ఉత్తరాఖండ్ 22-8తో ఒడిశాపై, హర్యానా 31-6తో చండీగఢ్‌పై, ఆంధ్రప్రదేశ్ 23-11తో జార్ఖండ్‌పై, బీహార్ 28-8తో పశ్చిమబెంగాల్‌పై, మహారాష్ట్ర 37-13తో కర్ణాటకపై గెలిచి శుభారంభం చేశాయి.