హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఇండోర్ వేదికగా జరిగిన ఏఏఐ 52వ ఇంటర్ ఇన్సిట్యూషనల్ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్లో తెలంగాణ యువ ప్యాడ్లర్ ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్ మూడు పతకాలతో అదరగొట్టాడు. వేర్వేరు విభాగాల్లో స్వర్ణం సహా రజతం, కాంస్యం ఖాతాలో వేసుకుని సత్తాచాటాడు. మంగళవారం జరిగిన పోటీల్లో ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్(ఐఏ, ఏడీ) తరఫున బరిలోకి దిగిన స్నేహిత్ సింగిల్స్ ఫైనల్లో 3-4 తేడాతో హర్మీత్దేశాయ్ చేతిలో ఓడి రజతం సొంతం చేసుకున్నాడు. డబుల్స్ ఫైనల్లో అభిమన్యు మిత్రతో జతకట్టిన స్నేహిత్ 3-2తో పశ్చిమబెంగాల్ ద్వయం అంకుర్ భట్టాచార్జి, శంకదీప్దాస్పై గెలిచి పసిడి పతకంతో మెరిశాడు. అదే జోరు కొనసాగిస్తూ తాను ప్రాతినిధ్యం వహించిన జట్టుకు కాంస్య పతకాన్ని అందించాడు.