Imane Khelif : ఒలింపిక్స్‌లో వివాదాస్పద బాక్సర్ ఇమనె ఖెలిఫ్ (Imane Khelif) విమర్శకులకు తన పంచ్‌తోనే సమాధానమిచ్చింది. విశ్వ క్రీడల ఆసాంతం ‘పురుష బాక్సర్’ అనే అపవాదు ఎదుర్కొన్న ఆమె బాక్సింగ్‌లో అల్జీరియాకు తొలి స్వర్ణం అందించింది. అనంతరం తాను మహిళనే అని అందరికీ మరోసారి చెప్తూ భోరున కన్నీళ్లు పెట్టుకుంది. ఒలింపిక్స్‌లో తన లక్ష్యం పూర్తికావడంతో ఇమనె విమర్శకులకు బుద్ది చెప్పేందుకు సిద్దమైంది.
విశ్వ క్రీడల సమయంలో తనపై ఆన్లైన్లో వేధింపులకు పాల్పడిన వాళ్లపై ఆమె కేసు పెట్టింది. వాళ్ల ఆలోచనలు మార్చాలనుకుంటున్నా అని ఇమనె చెప్పింది. ‘పారిస్ ఒలింపిక్స్ సమయంలో సోషల్ మీడియాలో నాపై వచ్చిన వార్తలు అనైతికమైనవి. అందుకనే వాళ్లను న్యాయ పోరాటంతో ఎదుర్కోవాలని భావిస్తున్నా. ప్రపంచంలోని అలాంటివాళ్ల ఆలోచనలు మార్చాలని అనుకుంటున్నా’ అని ఇమనె వెల్లడించింది.
నిరుడు ప్రపంచ చాంపియన్‌షిప్స్ ముందు నిర్వహించిన లింగ పరీక్ష(Gender Test)లో ఇమనె ఫెయిల్ అయింది. ఆమెలో టెస్టోస్టిరాన్ హార్మోన్ లక్షణాలు అధికంగా ఉండడంతో అమ్మాయిల విభాగంలో పోటీ పడేందుకు నిర్వాహకులు అనుమతించలేదు. కానీ, ఐఓసీ(IOC) మాత్రం ఖెలెఫ్ను పారిస్ ఒలింపిక్స్(Paris Olympics 2024)లో ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఒలింపిక్స్‌లో 66వ కిలోల విభాగంలో పోటీ పడిన ఇమనె తొలి బౌట్ నుంచే ప్రత్యర్థులను బెంబేలెత్తించింది. ఏడు అడుగుల ఎత్తు ఉండే ఇమనె పంచ్ ధాటికి రింగ్‌లో ఎవరూ నిలువలేకపోయారు. అయితే.. 16వ రౌండ్ మ్యాచ్‌లో ఇమనె ఖెలిఫ్ కేవలం 46 సెకన్లలోనే ఇటలీ బాక్సర్‌ను యాంజెల కరిని(Angela Carini)ని ఓడించింది. దాంతో, రింగ్‌లో తనను ఓ అబ్బాయి కొడుతున్నాడని, ఖెలిఫ్ అమ్మాయి కాదని యాంజెల వాపోయింది. అంతేకాదు ఇక తాను ఫైట్ చేయలేనంటూ ఆమె వైదొలిగిన విషయం తెలిసిందే. అక్కడితో అల్జీరియా బాక్సర్‌పై అందరికి సందేహం ఏర్పడింది. పురుష లక్షణాలున్న ఖెలిఫ్‌ను అమ్మాయిల బౌట్లో ఎలా అనుమతించారు? అని యావత్ ప్రపంచం ఐఓసీని ప్రశ్నించింది.