Iga Swiatek : రెండో సీడ్ ఇగ స్వియాటెక్(Iga Swiatek) మరో ట్రోఫీ ఖాతాలో వేసుకుంది. ప్రతిష్ఠాత్మక డబ్ల్యూటీఏ ఫైనల్లో(WTA Finals) గెలుపొంది సగర్వంగా ట్రోఫీని ముద్దాడింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో జెస్సికా పెగులా (అమెరికా)ను 6-1, 6-0తో ఓడించింది. ట్రోఫీ గెలవడంతో పాటు మళ్లీ నంబర్ 1 ర్యాంకు సొంతం చేసుకుంది. దాంతో, ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న అరినా సబలెంక(బెలారస్) రెండో స్థానానికి పడిపోయింది.
59 నిమిషాల పాటు సాగిన పోరులో స్వియాటెక్ జోరు ముందు పెగులా నిలవలేకపోయింది. తొలి సెట్లో కాసింత పోరాడిన పెగులా రెండో సెట్లో మొత్తానికే చేతులెత్తేసింది. దాంతో, స్వియాటెక్ ఈ సీజన్లో 17వ విజయం నమోదు చేసింది.
‘ఈ సీజన్ మొత్తం నా టీమ్, నేను ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూశాం. అందుకని ఈ విజయం చాలా ప్రత్యేకం. ఇదే విధంగా మేము పనిచేస్తే మరిన్ని టైటిళ్లు సాధిస్తాననే నమ్మకం ఉంది’ అని మ్యాచ్ అనంతరం స్వియాటెక్ పేర్కొంది. యూఎస్ ఓపెన్(US Open 2023) సమయంలో స్వియాటెక్ నంబర్ 1 ర్యాంక్ కోల్పోయిన విషయం తెలిసిందే.