టీమిండియాకు మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీ.. ఆటతీరులో ఎటువంటి మార్పూ రాదని, రాకూడదని మాజీ స్టార్ ఓపెనర్, దిగ్గజ బ్యాటర్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. కెప్టెన్గా ఉన్నా, లేకపోయినా ఆటతీరులో మార్పు రాకూడదని ఈ ప్రస్తుత పొలిటీషియన్ చెప్పాడు.
కెప్టెన్సీ బాధ్యత నుంచి తప్పుకున్న తర్వాత కోహ్లీలో క్రికెటర్గా ఎలాంటి మార్పులు చూడొచ్చు? అనే ప్రశ్నకు గంభీర్ బదులిచ్చాడు. ‘ఎటువంటి మార్పూ ఉండదు’ అని చెప్పాడు. ఒకవేళ కోహ్లీ విషయంలో ఏమైనా మార్పులు జరిగాయంటే, అక్కడ ఏదో తప్పు జరిగినట్లేనని అభిప్రాయపడ్డాడు.
‘చిన్నతనం నుంచి ఎవరైనా సరే భారత్ తరఫున ఆడి మ్యాచులు గెలవాలని అనుకుంటారు. అంతేకానీ కెప్టెన్ అవ్వాలనుకోరు. ఎవరూ కూడా మొదటి రోజు నుంచే కెప్టెన్ కాలేరు. నాకైతే కెప్టెన్సీ ఉన్నా లేకపోయినా ఏమీ మార్పు ఉండదు. ఎందుకంటే కెప్టెన్సీ ఒక బాధ్యత, గౌరవం మాత్రమే. కోహ్లీ కూడా ఇలాగే ఆలోచిస్తుంటాడని అనుకుంటున్నా’ అని సమాధానమిచ్చాడు.