న్యూఢిల్లీ: రాజకీయ క్రీడలో క్రికెట్ బలిపశువుగా మారినట్లు కనిపిస్తున్నది. టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా భారత్‌తో ఈనెల 15వ తేదీన జరగాల్సిన మ్యాచ్(India Vs Pakistan)ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం చేసిన ప్రకటన యావత్ క్రికెట్ జగత్తును షాక్‌లోకి నెట్టేసింది. వాస్తవానికి అదేమీ వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ కాదు, కానీ కొన్ని మ్యాచ్‌లు ట్రోఫీ కన్నా పెద్దవే అని అంగీకరించాలి. ఇండోపాక్ సమరం అంటేనే ఆ రేంజ్లో మ్యాచ్‌కు విలువు ఉంటుంది. ఇక మార్కెట్ వర్గాల ప్రకారం ఇండోపాక్ క్రికెట్ మ్యాచ్ విలువ సుమారు 4500 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. బ్రాడ్కాస్ట్ హక్కులు, అడ్వర్టయిజ్మెంట్ ప్రీమియంలు, స్పాన్సర్షిప్ , టికెట్లు, లీగల్ బెట్టింగ్ లాంటి వాటి వల్ల ఇండోపాక్ మ్యాచ్ విలువ సుమారు 4500 కోట్లు ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. అయితే క్రికెట్ మార్కెట్లో మరే మ్యాచ్‌కు కూడా ఇంత విలువ లేదు.
ఇండియా, పాకిస్థాన్ ఆడుతున్నాయంటే.. బ్రాడ్కాస్టర్లకు ఇక పండగే. ఆ మ్యాచ్ సమయంలో పది సెకన్ల వాణిజ్య ప్రకటనకు సుమారు 25 నుంచి 40 లక్షలు వసూల్ చేస్తారు. ఒకవేళ ఇండియా, పాక్ మ్యాచ్ జరగకపోతే అప్పుడు ఆ టోర్నీ ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం అవుతుంది. ఒకవేళ మ్యాచ్ రద్దు అయితే, తక్షణమే ఆ ప్రభావం ప్రసార హక్కులు కలిగిన సంస్థలపై పడుతుంది. కేవలం యాడ్ రెవన్యూ సుమారు 300 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆ ఆదాయం కోల్పోయే ప్రమాదం ఉంది. జియోస్టార్‌కు నష్టం వాటిల్లే అవకాశం ఉన్నది. వరల్డ్‌కప్‌లో ప్రతి మ్యాచ్ విలువ సగటున సుమారు 139 కోట్లు ఉంటుందని భావిస్తున్నారు. ఒకవేళ బ్రాడ్కాస్టర్ల వద్ద డబ్బులు ఆగిపోతే, అప్పుడు దాని ప్రభావం ఐసీసీపై పడుతుంది, దాని వల్ల స్థానిక క్రికెట్ బోర్డులపై ప్రభావం ఉంటుంది. ఐసీసీ ఇచ్చే పేమెంట్స్ మీద ఆధారపడే ప్రతి క్రికెట్ బోర్డు ఆ ఒడిదిడుకులకు లోనుకావాల్సి ఉంటుంది.
ఒకవేళ ఇండియా, పాక్ మ్యాచ్ జరగకపోతే, రెండు క్రికెట్ బోర్డులకు 200 కోట్ల తక్షణ నష్టం వాటిల్లుతుంది. ఇండియాకు జరిగే నష్టం బాధాకరమే అయినా.. దాన్ని మేనేజ్ చేసే అవకాశం ఉన్నది. కానీ పాకిస్థాన్‌కు జరిగే నష్టం మాత్రం పూడ్చలేనిది. ఐసీసీ రెవన్యూలో పీసీబీకి 5.75 శాతం ఆదాయం వస్తుంది. అంటే ప్రతి ఏడాది ఆ బోర్డుకు సుమారు 34.51 మిలియన్లు అందుతాయి. ఇప్పుడు స్వచ్ఛందగా మ్యాచ్ నుంచి తప్పుకుంటే ఆ నష్టాన్ని పాక్ బోర్డు భరించాల్సి ఉంటుంది. ఇన్సూరెన్స్ రక్షణ ఉండదు, న్యాయపరమైన ప్రయోజనం జరగదు, పెనాల్టీలు, నష్టపరిహారాన్ని స్వయంగా చూసుకోవాల్సి ఉంటుంది.
డబ్బు ఒక్కటే కాదు.. పాకిస్థాన్ తన విశ్వాసాన్ని కోల్పోవాల్సి వస్తుంది. బ్రాడ్కాస్టర్లు ఇక ఆ దేశాన్ని నమ్మలేని సిచ్యువేషన్ వస్తుంది. ద్వేషం వల్ల ప్రసార హక్కుల ప్యాకేజీలపై ప్రభావం పడుతుంది. పాకిస్థాన్ మ్యాచ్‌లకు ఉన్న స్పాన్సర్షిప్ ఆసక్తి తగ్గుతుంది. ఒక్క మ్యాచ్ ఆడకపోవడం వల్ల రాబోయే రోజుల్లో పాక్ క్రికెట్ బోర్డు ఆర్థిక వనరులు క్రమంగా తగ్గిపోనున్నాయి. ఆ మ్యాచ్‌ను చూసేందుకు ఇప్పటికే అభిమానులు విమాన, హోటళ్ల టికెట్లు బుక్ చేసుకున్నారు. మ్యాచ్ రద్దు అయితే వాళ్ల నష్టం వ్యక్తిగతంగా పూడ్చలేనిది. ఇండియా, పాక్ క్రికెట్ సమరం కేవలం ఓ మ్యాచ్ మాత్రమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఎన్నో క్రికెట్ టోర్నీలకు కావాల్సిన ఆర్థిక వనరుగా ఆ మ్యాచ్ నిలుస్తున్నది.
పాకిస్థాన్, ఇండియా ఇప్పటికే ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడడం లేదు. కేవలం ఐసీసీ నిర్వహించే చాంపియన్స్ ట్రోఫీ, వన్డే, టీ20 వరల్డ్‌కప్‌ల్లో మాత్రమే ఆ రెండు జట్లు తలపడుతున్నాయి. నిజానికి క్రికెట్లో రాజకీయ వివాదం ఇండియాతోనే మొదైలందని చెప్పుకోవచ్చు. గత చాంపియన్స్ ట్రోఫీని పాకిస్థాన్‌లో నిర్వహించారు. భద్రతా కారణాల వల్ల ఆ దేశంలో ఆడేందుకు ఇండియా నిరాకరించింది. దీంతో నష్టనివారణ చర్యల్లో భాగంగా ఆ టోర్నీలో ఇండియా మ్యాచ్‌లను దుబాయ్ వేదికకు తరలించారు. టోర్నీలో ఆడిన జట్లు అటూఇటూ తిరిగినా..ఇండియా మాత్రం దుబాయ్‌లోనే ఉండి అన్ని మ్యాచ్‌లను ఆడేసింది.
ఇక ఇటీవల బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడి.. ఆ ఘటనల నేపథ్యంలో ఆ దేశ ప్లేయర్ ముస్తఫిజుర్ రెహ్మాన్‌ను ఐపీఎల్ నుంచి తొలగించడం మరో రాజకీయ పరిణామంగా మారింది. తమ క్రికెటర్‌ను బహిష్కరించిన నేపథ్యంలో తాము ఇండియాలో ఆడబోమని బంగ్లాదేశ్ స్పష్టం చేసింది. వేదికలను మార్చాలని ఆ దేశం చేసిన అభ్యర్థనను ఐసీసీ తోసిపుచ్చింది. దీంతో బంగ్లా స్థానంలో స్కాట్ల్యాండ్ను వరల్డ్‌కప్‌కు తీసుకున్నారు. అయితే బంగ్లా అంశంలో ఆ దేశానికి పాకిస్థాన్ ఒక్కటే మద్దతు ఇచ్చింది. ఈ పెనుగులాట నేపథ్యంలో సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారాలు ఇండో, పాక్, బంగ్లా దేశాలను తీవ్ర వత్తిడిలోకి నెట్టేశాయి. సోషల్ మీడియా యోధుల నుంచి తప్పించుకునే క్రమంలో ..క్రికెట్ బోర్డులు అనుచిత నిర్ణయాలు తీసుకుని ఆ ఆట భవిష్యత్తుకు ప్రమాదంగా మారాయి.
2036లో ఒలింపిక్స్ నిర్వహించాలన్న ఆలోచనలో ఇండియా ఉన్నది. దీని కోసం బిడ్ కూడా వేయనున్నది. ఇండియాలో ఆడేందుకు కొన్ని దేశాలు నిరాకరిస్తున్న సమయంలో.. ఒలింపిక్స్ నిర్వహించేందుకు ఆ కమిటీ అనుమతి ఎలా ఇస్తుందన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. క్రీడల్లో రాజకీయ జోక్యం తగ్గితేనే.. ఆ ఆటకు భవిష్యత్తు ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.