T20 World Cup | కౌలాలంపూర్: ఐసీసీ మహిళల అండర్-19 ప్రపంచకప్‌లో వరుస విజయాలతో దుమ్మురేపుతున్న యువ భారత జట్టు.. శుక్రవారం జరిగే తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ను ఢీకొననుంది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగి ఈ టోర్నీలో అజేయంగా నిలిచిన టీమ్ఇండియా.. అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. లీగ్ దశ, సూపర్ సిక్స్‌తో పోలిస్తే సెమీస్‌లో ఎదురయ్యే ప్రత్యర్థి కాస్త బలమైన జట్టు కావడంతో అమ్మాయిలు జాగ్రత్తగా ఆడాల్సి ఉంది. అయితే ఇంగ్లండ్‌తో పోలిస్తే బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో యంగ్ ఇండియా బలంగా ఉంది.
బ్యాటింగ్‌లో తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష.. రికార్డు శతకంతో పాటు రెండు 40+ స్కోర్లతో టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్ (230)గా కొనసాగుతున్నది. త్రిష సెమీస్‌లోనూ ఇదే జోరు కనబర్చాలని భారత్ ఆశిస్తోంది. బ్యాట్‌తో పాటు బంతితోనూ ఆమె సత్తా చాటుతుండటం జట్టుకు కలిసి వస్తోంది.
ఇక రెండో ఎడిషన్‌లో ఇప్పటివరకూ భారత్‌తో ఆడిన ఏ జట్టూ బ్యాటింగ్ చేస్తూ 75 పరుగుల మార్కును దాటలేకపోయిందంటే వికెట్ల వేటలో మన బౌలర్లు ఎంత ఆకలిగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. స్పిన్నర్లు వైష్ణవి శర్మ, అయూషి శుక్లాతో పాటు పేసర్లు జోషితా, షబ్నమ్ చెలరేగితే వరుసగా రెండోసారి ఫైనల్ చేరడం భారత్‌కు పెద్ద కష్టమేమీ కాదు.