దుబాయ్: పురుషులతో సమానంగా మహిళల క్రికెట్‌ను ప్రోత్సహిస్తున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మరో కీలక ముందడుగు వేసింది. ఇక నుంచి ప్రతి ఏడాదీ మహిళా క్రికెట్లోనూ ఓ భారీ టోర్నీ ఉండేలా ప్రణాళికలు రచించింది. ఈ మేరకు ఐసీసీ సోమవారం ఉమెన్స్ ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ (ఎఫ్టీపీ) 2025-2029 షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఇందులో భాగంగా రాబోయే ఐదేండ్లలో రెండు వన్డే ప్రపంచకప్పులు (2025, 2029), రెండు టీ20 ప్రపంచకప్పు (2026, 2028)లతో పాటు 2027లో చాంపియన్స్ ట్రోఫీని నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసింది.
2027 జూన్-జూలైలో ఆరు జట్లతో తొలిసారి జరుగబోయే చాంపియన్స్ ట్రోఫీ (టీ20 ఫార్మాట్లో)కి శ్రీలంక ఆతిథ్యమివ్వనుంది. లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ (2028లో) షెడ్యూల్ కూడా ఈ సైకిల్లో భాగం కానుంది. కొత్త సైకిల్లో మూడు ఫార్మాట్లలోనూ కలిసి 400 మ్యాచ్‌లు జరుగనున్నాయి. భారత్ విషయానికొస్తే ఈ ఐదేండ్ల కాలంలో సొంతగడ్డపై ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, జింబాబ్వేతో సిరీస్‌లు ఆడాల్సి ఉండగా న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, ఐర్లాండ్ పర్యటనలకు వెళ్లాల్సి ఉంది. కొత్త షెడ్యూల్ నేపథ్యంలో 2026 నుంచి మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) జనవరి నుంచే మొదలుకానుంది.