ICC Stop Clock Rule | పరిమిత ఓవర్ల క్రికెట్లో మ్యాచ్‌లను ఆన్‌టైమ్‌లో పూర్తిచేసేందుకు గాను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నడుము బిగించింది. ఈ ఏడాది జూన్ నుంచి మొదలుకాబోయే ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో ‘స్టాప్ క్లాక్’ నిబంధనను అమలుచేయనుంది. గతేడాది డిసెంబర్ నుంచి ఈ రూల్‌ను ఐసీసీ ప్రయోగాత్మకంగా అమలుచేస్తోంది. వెస్టిండీస్ – ఇంగ్లండ్ మధ్య ముగిసిన టీ20 సిరీస్‌లో దీనిని అమలుచేశారు. ఏప్రిల్ నాటికి ఈ నిబంధనను పరిశీలించాల్సి ఉండగా ఇటీవలే దీనిపై రివ్యూ నిర్వహించిన ఐసీసీ.. దీనిలో వస్తున్న ఫలితాలపై మాత్రం సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ ఏడాది జూన్ 1 నుంచి టీ20లతో పాటు వన్డేలలో కూడా ఈ నిబంధనను పర్మనెంట్‌గా వర్తింపజేయనునుందని ఒక ప్రకటనలో వెల్లడించింది.
వైట్ బాల్ క్రికెట్లో వృథా సమయాన్ని అరికట్టి నిర్దేశిత సమయంలో మ్యాచ్‌లను పూర్తిచేసేందుకు గాను ఐసీసీ ఈ నిబంధనను గతేడాది తీసుకొచ్చింది. స్టాప్ క్లాక్ రూల్ ప్రకారం.. బౌలింగ్ చేసే జట్టు ఒక ఓవర్ ముగిసిన తర్వాత 60 సెకన్లలోపు తిరిగి మరో ఓవర్‌ను ప్రారంభించాలి. ఇందుకు గాను థర్డ్ అంపైర్.. స్టాప్ క్లాక్‌ను ఉపయోగించి సమయాన్ని లెక్కిస్తాడు. ఓవర్ తర్వాత ఫీల్డింగ్ టీమ్ కెప్టెన్ తర్వాత ఓవర్‌ను ఎవరితో వేయించాలి..? అని తీరిగ్గా ఆలోచించడం.. ఆటగాళ్లతో పిచ్చాపాటి ముచ్చట్లు పెడితే కుదరదన్నమాట. ఓవర్ పూర్తికాకముందే సదరు సారథి తర్వాత ఓవర్ ఎవరితో వేయించాలి..? అనేదానిపై పూర్తి స్పష్టతకు రావాల్సి ఉంటుంది.
ఒక ఓవర్ పూర్తయి మరో ఓవర్ ప్రారంభానికి 60 సెకన్ల కంటే ఎక్కువ సమయం గనక తీసుకుంటే రెండు సార్లు హెచ్చరికలతో వదిలేస్తారు. కానీ మూడోసారి కూడా ఇదే రిపీట్ అయితే బ్యాటింగ్ టీమ్‌కు ఐదు అదనపు పరుగులు ఇస్తారు. దీనివల్ల మ్యాచ్‌లు షెడ్యూల్ చేసిన టైమ్‌లో ముగుస్తాయనేది ఐసీసీ వాదన. అయితే ఓవర్లో చివరి బంతికి డీఆర్ఎస్ తీసుకున్నా.. ఒక బ్యాటర్ ఔట్ అయినా, మరే ఇతర అత్యవసరాలు తప్ప మిగతా వాటికి మాత్రం మినహాయింపు ఉండదు.
JUST IN: ICC to introduce stop-clock rule permanently in white-ball cricket.
Details 👇
— ICC (@ICC) March 15, 2024
ఈ ఏడాది జూన్‌లో ఐసీసీ నిర్వహించనున్న టీ20 వరల్డ్ కప్ నుంచి కొత్త నిబంధన అమలుకానున్న నేపథ్యంలో సారథులు, జట్లు ఆ మేరకు ఎలా సిద్ధమవుతాయనేది ఆసక్తికరంగా మారింది.