Champions Trophy | దుబాయ్: గతేడాది ఐసీసీ టీ20 ప్రపంచకప్ నెగ్గి భారత క్రికెట్ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించిన రోహిత్ సేన.. మరో కీలక టోర్నీకి సిద్ధమైంది. వన్డే ఫార్మాట్లో ‘మినీ ప్రపంచకప్’గా గుర్తింపు పొందిన చాంపియన్స్ ట్రోఫీని ఎనిమిదేండ్ల క్రితం తృటిలో చేజార్చుచుకున్న భారత్.. దానిని తిరిగి దక్కించుకునే దిశగా బుధవారం నుంచి టైటిల్ వేటను ఆరంభించనుంది. పాకిస్థాన్/దుబాయ్ వేదికలుగా జరుగుతున్న ఈ టోర్నీ 9వ ఎడిషన్‌లో భాగంగా.. మెన్ ఇన్ బ్లూ గురువారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. టోర్నీ ఫేవరేట్లలో ఒకటిగా బరిలో ఉన్న టీమ్ఇండియాకు బంగ్లాదేశ్ ఏ మేరకు సవాలు విసురుతుందనేది ఆసక్తికరం.
ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై జరిగిన వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన భారత్.. రెట్టించిన ఉత్సాహంతో చాంపియన్స్ బరిలో నిలిచింది. బ్యాటింగ్ విభాగంలో టీమ్ఇండియాకు కష్టాలేం లేవు. కొంతకాలంగా ఫామ్ కోల్పోయి తంటాలు పడ్డ దిగ్గజ బ్యాటర్లు రోహిత్, కోహ్లీ ఇంగ్లండ్ సిరీస్‌తో టచ్‌లోకి వచ్చారు. ఓపెనర్ గిల్ కూడా రెండు అర్ధ సెంచరీలు, ఓ శతకంతో జోరుమీదున్నాడు.
దేశవాళీలో అదరగొట్టి జాతీయ జట్టులోకి వచ్చిన శ్రేయస్ అయితే నెక్స్ లెవల్ దూకుడుతో సాగుతున్నాడు. అయితే వచ్చిన సమస్యల్లా ఐదో స్థానంలో ఎవరిని ఆడించాలనేదే! ఇంగ్లండ్‌తో సిరీస్‌లో భాగంగా తొలి రెండు వన్డేలలో టీమ్ మేనేజ్మెంట్.. అక్షర్‌ను ఐదో స్థానంలో పంపించి సక్సెస్ అయింది. మళ్లీ మూడో వన్డేలో రాహుల్‌ను ఇదే స్థానంలో ఆడిస్తే అతడూ తనకు అచ్చొచ్చిన స్థానంలో మెరిశాడు. మరి చాంపియన్స్ ట్రోఫీలో ఐదో స్థానంలో ఎవరిని ఆడిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
బ్యాటింగ్ విభాగంలో భారత్‌కు ఇబ్బందుల్లేకపోయినా బౌలింగ్ విభాగం మాత్రం కాస్త వీక్‌గా ఉంది. బుమ్రా గైర్హాజరీ నేపథ్యంలో సీనియర్ పేసర్ మహ్మద్ షమీపై భారం పడనుంది. అతడికి అండగా హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్‌ను ఎంపికచేసినా ఈ ఇద్దరికీ అంతర్జాతీయ స్థాయిలో వన్డేలు ఆడిన అనుభవం తక్కువ. అదీగాక ఆరంభంలో భారీగా పరుగులిచ్చుకునే బలహీనత ఇద్దరిలోనూ ఉంది.
ఇంగ్లండ్‌తో సిరీస్‌లో హర్షిత్ వికెట్లు పడగొట్టినా ఈ టోర్నీలో అర్ష్‌దీప్ వైపే మేనేజ్మెంట్ మొగ్గుచూపే అవకాశముంది. బంతిని రెండువైపులా స్వింగ్ చేయడంలో అతడు సిద్ధహస్తుడు. ఇక పేస్ ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. నెమ్మదిగా స్పందించే దుబాయ్ పిచ్‌లపై స్పిన్నర్లు కీలక పాత్ర పోషించే అవకాశాలున్న నేపథ్యంలో భారత్ ముగ్గురు స్పిన్నర్ల ఫార్ములాతో బరిలోకి దిగొచ్చు. ఈ టోర్నీలో భారత్ ఏకంగా ఐదుగురు స్పిన్నర్లకు జట్టులో చోటు కల్పించింది. అక్షర్, జడేజా, కుల్దీప్, వరుణ్, వాషింగ్టన్లో ఎవరికి ఆ అదృష్టం వరిస్తుందనేది చూడాలి.
2023 వన్డే ప్రపంచకప్ తర్వాత 12 వన్డేలు ఆడిన బంగ్లాదేశ్.. నాలుగు మాత్రమే గెలిచింది. లిటన్ దాస్, షకిబ్అల్ హసన్ వంటి స్టార్లు లేకపోయినా ముష్ఫీకర్, మిరాజ్, నహిద్ రాణా, టస్కిన్ అహ్మద్ వంటి ప్రతిభావంతమైన ఆటగాళ్లు ఆ జట్టు సొంతం. తమదైన రోజున ఏ జట్టునైనా సవాల్ చేయగల సత్తా బంగ్లాదేశ్ సొంతం. కానీ నిలకడలేమి ఆ జట్టుకు ప్రధాన శత్రువు. ఈ నేపథ్యంలో భారత్‌ను బంగ్లా ఏ మేరకు నిలువరిస్తుందనేది ఆసక్తికరం.