T20 World Cup 2024 : ప్రతిష్ఠాత్మక టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ టికెట్ల కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు గుడ్‌న్యూస్. టోర్నీకి మరో ఆరునెలలు ఉండగానే ఐసీసీ(ICC) మ్యాచ్ టికెట్లు అమ్మకానికి పెట్టింది. అది కూడా ప్రీ- బుకింగ్ పద్ధతిలో. ప్రతి ఒక్కరికి పారదర్శకంగా టికెట్లు లభించాలనే ఉద్దేశంతో పబ్లిక్ బ్యాలట్(Public Ballot) ద్వారా వీటిని అందుబాటులో ఉంచింది. ఈ విషయాన్ని ఐసీసీ అధికారులు శుక్రవారం వెల్లడించారు.
‘అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరుగనున్న పురుషుల టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ టికెట్ల అమ్మకాలను ప్రారంభించినందుకు చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. ప్రపంచలోని అభిమానులందరికీ నిష్పక్షపాతంగా టికెట్లు అందించాలనే ఆలోచనతో పబ్లిక్ బ్యాలట్ ద్వారా టికెట్లు అమ్ముతున్నాం.
ఈ ఏడు రోజుల్లో ఎప్పుడైనా టికెట్లకు అప్లై చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నా’ అని ఐసీసీ ఈవెంట్స్ హెడ్ క్రిస్ టెట్లే(Chirs Tetley) తెలిపాడు. పబ్లిక్ బ్యాలట్ ద్వారా టికెట్లను tickets.t20worldcup.com లో ఐసీసీ అందుబాటులో పెట్టింది. టికెట్ల ధరను 6 డాలర్ల నుంచి 25 డాలర్లుగా నిర్ణయించింది. భారతీయ కరెన్సీలో కనీస టికెట్ ధర రూ.497 కాగా అత్యధిక ధర రూ.2,070. ఈ విండో ద్వారా ఏకంగా 2.60 లక్షల టికెట్లను ఐసీసీ అమ్మకానికి పెట్టింది.
వెబ్సైట్లో లాగిన్ అయ్యాక ఒక్కొక్కరు ఒక్క మ్యాచ్‌కు ఆరు టికెట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలా ఎన్ని మ్యాచ్‌లకైనా ఒక్కరు ఆరేసి టికెట్లకు అప్లై చేయవచ్చు. అంటిగ్వా సమయం ప్రకారం ఫిబ్రవరి 7వ తేదీ రాత్రి 23 గంటల 59 నిమిషాల వరకు టికెట్లకు అప్లై చేసుకొనే వీలుంది.
టికెట్ బుకింగ్ ఇలా..
పబ్లిక్ బ్యాలట్ ద్వారా అమ్ముడుపోగా మిగిలిన టికెట్లను ఫిబ్రవరి 22 నుంచి tickets.t20worldcup.com వెబ్సైట్లో యథావిధిగా అమ్ముతారు. బ్యాలట్ ముగిశాక టికెట్లు దొరికిన వాళ్లకు మెయిల్ ద్వారా ఏ మ్యాచ్‌కు టికెట్ దక్కింది? అనే వివరాలతో పాటు పేమెంట్ లింక్ కూడా పంపిస్తారు. ఒకవేళ నిర్దేశించిన సమయానికి డబ్బులు కట్టకుంటే ఆ టికెట్లు క్యాన్సిల్ అవుతాయి.
అమెరికా, వెస్టిండీస్ ఆతిథ్యమిస్తున్న పొట్టి ప్రపంచ కప్ జూన్ 1వ తేదీన మొదలవ్వనుంది. మొత్తంగా 9 సిటీల్లో 55 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇప్పటికే ఈ మెగా టోర్నీకి క్వాలిఫై అయిన 20 జట్లు సన్నాహక మ్యాచ్‌లతో బిజీగా ఉన్నాయి.