ICC : అంతర్జాతీయ క్రికెట్లో యువ కెరటాలు సంచలన ప్రదర్శనతో దూసుకొస్తున్నారు. 2023 ఏడాదిలో కొందరు యంగ్ గన్స్ అమితంగా ఆకట్టుకున్నారు. టెస్టులు, వన్డేలు, టీ20లతో పాటు వన్డే వరల్డ్ కప్(ODI Wordl Cup)లో అద్భుతంగా రాణించిన క్రికెటర్లు ‘ఐసీసీ మెన్స్ ఎమర్జింగ్ ప్లేయర్ 2023’కి ఎంపికయ్యారు.
భారత యువ కెరటం యశస్వీ జైస్వాల్(Yashasvi Jaiswal), న్యూజిలాండ్ ఓపెనర్ రచిన్ రవీంద్ర(Rachin Ravindra), దక్షిణాఫ్రికా పేస్ సంచలనం గెరాల్డ్ కొయెట్జీ(Gerald Coetzee), శ్రీలంక పేసర్ దిల్షాన్ మధుషనక(Dilshan Madhushanaka) నామినేట్ అయినట్టు ఐసీసీ వెల్లడించింది.
యశస్వీ జైస్వాల్
ఐపీఎల్ 16వ సీజన్లో చితక్కొట్టిన యశస్వీ.. అనంతరం భారత జట్టులోకి వచ్చాక పరుగుల ప్రవాహాన్ని కొనసాగించాడు. వెస్టిండీస్ పర్యటన(Westindies Tour)లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఈ యంగ్‌స్టర్ సెంచరీతో మెరిశాడు. ఆ తర్వాత జరిగిన ఆసియా గేమ్స్, ఆస్ట్రేలియా సిరీస్‌లో చెలరేగి జట్టుకు శుభారంభాలు ఇచ్చాడు. ఇక కివీస్ కుర్ర ఓపెనర్ రచిన్ రవీంద్ర తొలి వరల్డ్ కప్‌లోనే విశ్వరూపం కనబరిచాడు.
రచిన్ రవీంద్ర
లీగ్ దశ నుంచి బాదడమే పనిగా పెట్టుకున్న రవీద్ర రెండు సెంచరీలతో కలిపి 565 పరుగులు సాధించి ఔరా అనిపించాడు. దక్షిణాఫ్రికా పేస్ సెన్సేషన్ కొయెట్జీ ప్రపంచ కప్‌లో అదరగొట్టాడు. స్టార్ పేసర్ నోర్జి లేని లోటును భర్తీ చేస్తూ వికెట్ల వేట కొనసాగించాడు.
గెరాల్డ్ కొయెట్జీ
కొయెట్జీ 8 మ్యాచుల్లో 6.23 ఎకానమీతో 20 వికెట్లు పడగొట్టాడు. మెగా టోర్నీలో ఆలస్యంగా జట్టుతో కలిసినప్పటికీ లంక పేసర్ మధుషనక ఇరగదీశాడు. 9 మ్యాచుల్లో 6.70 ఎకానమీతో 21 వికెట్లు నేలకూల్చాడు. అయినా సరే వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో లంక అట్టడుగున నిలిచింది.