ముంబై: వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ కొత్త సైకిల్ ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే 2027-29 సిరీస్ కోసం ఐసీసీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చిన్న దేశాలకు టెస్టు మ్యాచ్‌లను నాలుగు రోజులే నిర్వహించాలన్న నిర్ణయాన్ని ఐసీసీ తీసుకున్నట్లు ఓ నివేదిక ద్వారా తెలుస్తోంది. అయితే ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లకు ఆ మినహాయింపు ఇచ్చినట్లు కూడా రిపోర్టులో వెల్లడించారు. లార్డ్స్‌లో కొన్ని రోజుల క్రితం డబ్ల్యూటీసీ ఫైనల్ జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఐసీసీ చైర్మెన్ జే షా దీనిపై చర్చించినట్లు తెలుస్తోంది. 4 రోజుల టెస్టు మ్యాచ్‌లకు ఆయన మద్దుత ఇచ్చినట్లు రిపోర్టులో తెలిపారు. 2027-29 సైకిల్‌కు ఆ విధానాన్ని మంజూరీ చేసినట్లు వెల్లడైంది.
2017లోనే ద్వైపాక్షికంగా నిర్వహించే సిరీస్‌లకు నాలుగు రోజుల టెస్టుకు ఐసీసీ అనుమతి ఇచ్చింది. గత నెలలో ఇంగ్లండ్, జింబాబ్వే మధ్య నాలుగు రోజుల టెస్టు జరిగింది. ఐర్లాండ్‌తోనూ 2019, 2023లో 4 డే టెస్టులు ఇంగ్లండ్ ఆడింది. సంప్రదాయకరమైన 5 రోజుల టెస్టును నిర్వహించేందుకు చాలా దేశాలు నిర్లిప్తంగా ఉన్నాయని, అయితే 4 రోజుల టెస్టులను నిర్వహించడం వల్ల.. మూడు టెస్టుల సిరీస్‌ను కేవలం మూడు వారాల్లోనే పూర్తి చేయవచ్చు అని రిపోర్టులో వెల్లడించినట్లు తెలుస్తోంది. 4 రోజుల మ్యాచ్‌ల్లో ఓవర్లను 98కి పెంచాలని భావిస్తున్నారు.
2025-27 వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌ను 5 రోజుల ఫార్మాట్లోనే ముగించనున్నారు. మంగళవారం శ్రీలంక, బంగ్లాదేశ్ టెస్టు సిరీస్‌తో ఈ కొత్త సైకిల్ ప్రారంభం అవుతోంది. 2025-27 సైకిల్లో మొత్తం 27 టెస్టు మ్యాచ్ సిరీస్‌లు ఉంటాయి. దీంట్లో 17 సిరీస్‌లు రెండేసి మ్యాచ్‌ల ఉంటాయి. మరో ఆరు సిరీస్‌ల్లో మూడేసి మ్యాచ్‌లు జరుగుతాయి. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, ఇండియా మధ్య మాత్రం అన్ని 5 టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లు జరుగుతాయని రిపోర్టులో తెలిపారు.