ICC Rankings | వుమెన్స్ టీ20 ర్యాంకింగ్స్‌ను ఐసీసీ బుధవారం విడుదల చేసింది. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, ఓపెనర్ షెఫాలీ వర్మ ర్యాంకులు మరింత మెరుగయ్యాయి. ఇటీవల దక్షిణాఫ్రికాతో ముగిసిన సిరీస్‌లో అద్భుతమైన ప్రదర్శనతో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో హర్మన్‌ప్రీత్ 12వ స్థానానికి, షెఫాలీ వర్మ 15వ స్థానానికి చేరుకుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ 613 రేటింగ్ పాయింట్లు ఉండగా.. మూడు స్థానాలు ఎగబాకి 12వ స్థానానికి చేరుకున్నది. షెఫాలీ వర్మ రెండు స్థానాలు మెరుగుపరుచుకొని 605 రేటింగ్ పాయింట్లతో 15వ స్థానానికి చేరింది. న్యూజిలాండ్‌కు చెందిన అమేలియా కెర్, ఇంగ్లండ్‌కు చెందిన డానీ వ్యాట్‌లతో కలిసి షెఫాలీ 15వ స్థానంలో ఉన్నది.
ఇక టీమిండియా ఓపెనర్ స్మృతి మంధాన ఐదో స్థానంలో కొనసాగుతున్నది. టాప్-10లో ర్యాంకుల్లో కేవలం టీమిండియా నుంచి క్రీడాకారిణుల్లో స్మృతి మంధాన ఉన్నది. బౌలర్ల జాబితాలో వెటరన్ దీప్తి శర్మ మూడో స్థానంలో కొనసాగుతున్నది. రాధా యాదవ్ ఎనిమిది స్థానాలు ఎగబాకి 15వ స్థానానికి, పూజా వస్త్రాకర్ ఆరు స్థానాలు ఎగబాకి 23వ ర్యాంక్‌కు, శ్రేయాంక పాటిల్ 9 స్థానాలు ఎగబాకి 60వ ర్యాంక్‌కు చేరుకున్నది. ఇంగ్లండ్ స్పిన్నర్ సారా గ్లెన్ 768 పాయింట్లతో కెరీర్లో రెండోస్థానంలో ఉన్నది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 ఇంటర్నేషనల్ సిరీస్‌లో గ్లెన్ ఎనిమిది వికెట్లు పడగొట్టింది. సోఫీ ఎక్లెస్టోన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నది. ఇదిలా ఉండగా.. టీమిండియా ఆసియా కప్‌లో పాల్గొననున్నది. ఈ నెల 19 నుంచి ఆసియా కప్ జరుగనుండగా.. చిరకాల ప్రత్యర్థి పాక్‌తో టీమిండియా తలపడనున్నది.