ఢాకా: మరో మూడు వారాల్లో మొదలుకానున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను భారత్‌లో ఆడేది లేదని మొండిపట్టు పట్టిన బంగ్లాదేశ్‌కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆఖరి అవకాశం ఇచ్చిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. తమ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని బంగ్లా డిమాండ్ చేస్తుండగా అందుకు ఐసీసీ ససేమిరా ఒప్పుకోవడం లేదు. కానీ బంగ్లాదేశ్ మాత్రం తమ గౌరవాన్ని తాకట్టుపెట్టి భారత్‌లో ఆడబోమని ఇప్పటికే ఐసీసీకి తేల్చి చెప్పింది.
ఈ నేపథ్యంలో గత శనివారం ఢాకాలో ఐసీసీ, బంగ్లా క్రికెట్ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు ఫలవంతం కాలేదని తెలుస్తున్నది. దీంతో ఐసీసీ.. బంగ్లా బోర్డుకు అల్టిమేటం జారీ చేసినట్టు సమాచారం. భారత్‌లో ఆడేది లేనిది ఈనెల 21 వరకు తేల్చాలని.. లేకుంటే తాము వేరే జట్టును భర్తీ చేసుకుంటామని బంగ్లాకు స్పష్టం చేసినట్టు వార్తలొస్తున్నాయి. ఒకవేళ బంగ్లా టోర్నీ నుంచి తప్పుకుంటే స్కాట్లాండ్కు ప్రాతినిథ్యం దక్కే అవకాశాలున్నాయి.