ICC on Wide Ball | క్రికెట్లో నిబంధనలు ఎక్కువగా బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా ఉన్నాయి. దాంతో బౌలర్లు ఇబ్బందిపడుతుంటారు. వైడ్ బాల్స్ విషయంలోనూ బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగానే రూల్స్ ఉన్నాయి. అయితే, బౌలర్స్‌కు కొంత ప్రయోజనం కలిగించేలా ఐసీసీ నిబంధనల్లో మార్పులు చేయబోతున్నది. ఈ విషయాన్ని దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ షాన్ పొల్లాక్ వెల్లడించారు. పోలాక్ ప్రస్తుతం ఐసీసీ క్రికెట్ కమిటీ సభ్యుడిగా పని చేస్తున్నారు. అయితే, ప్రస్తుతం బ్యాట్స్‌మెన్‌కు ప్రయోజనకరంగా ఉన్న వైడ్ బాల్ నిబంధనలను బౌలర్స్‌కు బెనిఫిట్ దక్కేలా మార్పులు చేయాలని ఐసీసీ భావిస్తుందని తెలిపారు.
ప్రస్తుత నిబంధనలతో బౌలర్స్ ఇబ్బందులుపడుతున్నారని షాన్ పోలాక్ పేర్కొన్నారు. ‘వన్డే, టీ20 ఫార్మాట్స్‌లో బ్యాటర్స్ క్రీజు వదిలి బయటకు రావడం చేస్తుంటారు. అలాంటి సమయంలో బౌలర్ బంతిని స్టంప్స్‌కు కాస్త దూరంగా వేయడం జరుగుతుంది. ఇకపై అలాంటి వాటిపై అంపైర్స్ దృష్టి సారిస్తారు’ అని పోలాక్ పేర్కొన్నారు. ఐసీసీ క్రికెట్ కమిటీ సభ్యుడిగా తాను ఇదే అంశంపై పని చేస్తున్నానని పోలాక్ తెలిపారు. బ్యాట్స్‌మెన్‌తో పాటు బౌలర్లకు ప్రయోజనం కలిగేలా మార్పులు చేస్తామన్నారు. బ్యాటర్ చివరి నిమిషంలో క్రీజు నుంచి బయటకు వెళితే.. సరైన ప్రదేశంలో బాల్ వేయడం బౌలర్‌కు కష్టమని.. ఒక వేళ బ్యాటర్ కదిలిన సమయంలో.. బంతి దూరంగా వెళ్లిందనుకుందామని.. అప్పుడు ఆ బ్యాటర్ ఎక్కడైతే ఉన్నాడో… అక్కడి నుంచి బాల్ దూరాన్ని పరిశీలనలోకి తీసుకోవాలన్నారు. అప్పుడే వైడ్ బాల్‌పై ఓ నిర్ణయానికి రావాలని.. ప్రస్తుతం ఈ రూల్‌పై చర్చల్లో ఉందని తెలిపారు.
ప్రస్తుతం క్రికెట్లో బ్యాట్స్‌మెన్స్ హవా కొనసాగుతుందని.. బౌలర్లకు అండగా నిలువాల్సిన అవసరం ఉందని.. దాంట్లోనే భాగంగా ఈ ఆలోచన చేశామని పోలాక్ వివరించారు. రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీలో ఉపఖండ పరిస్థితులపై దక్షిణాఫ్రికా ఆటగాళ్లు అనుభవాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వన్డే ప్రపంచకప్‌లో ఆడిన ఆటగాళ్లే ఎక్కువగా తమ జట్టులో ఉన్నారన్నారు. సెమీఫైనల్స్‌కు చేరుకొని ఆస్ట్రేలియాపై ఓడిపోయామని మాజీ కెప్టెన్ పేర్కొన్నారు. జాతీయ జట్టులో ఉన్న ఆటగాళ్లు ఐపీఎల్లో ఆడుతున్నారని.. ఉపఖండం పరిస్థితులు తెలిసిన వారే ఉన్నారని.. ఈ అనుభవం దక్షిణాఫ్రికా జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని పోలాక్ పేర్కొన్నారు.