దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి కొత్త సీఈవోగా మీడియా మొఘల్ సంజోగ్ గుప్తా( Sanjog Gupta)ను నియమించారు. చాలా సుదీర్ఘమైన రీతిలో రిక్రూట్మెంట్ ప్రక్రియ జరిగింది. మార్చిలో కొత్త సీఈవో రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొదలైంది. జియోస్టార్‌లో స్పోర్ట్స్ అండ్ లైవ్ ఎక్స్పీరియన్సెస్ సీఈవోగా చేశారాయన. ఐసీసీ సీఈవోగా తక్షణమే గుప్తా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఐసీసీ చైర్మెన్‌గా జేషా కొనసాగుతున్న విషయం తెలిసిందే.
సీఈవో పోస్టు కోసం సుమారు 25 దేశాల నుంచి 2500 అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దాంట్లో 12 మంది అభ్యర్థులను షార్ట్ లిస్టు చేశారు. క్రీడా పరిపాలనా సంఘాలు, సీనియర్ కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లు కూడా ఐసీసీ సీఈవో పోస్టు కోసం పోటీపడ్డారు. అయితే నామినేషన్స్ కమిటీకి ప్రతిపాదిత పేర్లను ఫార్వర్డ్ చేశారు. ఆ కమిటీ గుప్తాను కొత్త సీఈవోగా ఎన్నుకున్నది. ఐసీసీ కమిటీలో డిప్యూటీ చైర్మెన్ ఇమ్రాన్ ఖవాజా, ఈసీబీ చైర్మెన్ రిచర్డ్ థాంప్సన్, ఎస్ఎల్సీ ప్రెసిడెంట్ షమ్మి సిల్వా, బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఉన్నారు.
కమిటీ ప్రతిపాదించిన పేరును చైర్మెన్ జేషా అప్రూవ్ చేశారు. ఆ తర్వాత ఐసీసీ బోర్డుకు చేరవేశారు. సీఈవోగా నియమితుడైన తర్వాత సంజోగ్ గుప్తా ప్రకటన రిలీజ్ చేశారు. క్రికెట్ అభివృద్ధికి సహకరించనున్నట్లు చెప్పారు. ఐసీసీ బోర్డు సభ్యులతో కలిసి పనిచేయనున్నట్లు వెల్లడించారు. జర్నలిస్టుగా గుప్తా తన కెరీర్‌ను మొదలుపెట్టాడు. 2010లో అతను స్టార్ ఇండియాలో చేరాడు. కాంటెంట్, ప్రోగ్రామింగ్, స్ట్రాటజీ అంశాల్లో ఆయన కీలకంగా వ్యవహరించారు. డిస్నీ, స్టార్ ఇండియా స్పోర్ట్స్ చీఫ్‌గా ఉన్నారు. జియోస్టార్ స్పోర్ట్స్ సీఈవోగా నవంబర్ 2024లో నియమితుడయ్యారు.