Ian Chappell: ఆస్ట్రేలియా ప్రధాన స్పిన్నర్ నాథన్ లయాన్ ప్రదర్శనపై ఆ జట్టు మాజీ కెప్టెన్ ఇయాన్ ఛాపెల్ ఆసక్తికర కామెంట్ చేశాడు. అతనేమీ రవిచంద్రన్ అశ్విన్ కాదని, అందుకని లయాన్ అశ్విన్‌ను అనుకరించొద్దని ఛాపెల్ అన్నాడు. అంతేకాదు తన సొంత స్టయిల్లోనే సక్సెస్ అయ్యేందుకు ప్రయత్నించాలని లయాన్‌కు సూచించాడు. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోతో ఛాపెల్ మాట్లాడుతూ.. ‘ప్రత్యర్ధి జట్ల స్పిన్నర్లు భారత జట్టు ప్రధాన స్పిన్నర్లు అశ్విన్, రవీంద్ర జడేజాలను అనుకరించాలని చూస్తారు. కానీ అది సాధ్యం కాదు. ఎందుకంటే.. స్వదేశంలో ఎలా బౌలింగ్ చేయాలో ఈ ఇద్దరికి బాగా తెలుసు.
అశ్విన్ ఒక అద్భుతమైన బౌలర్. అంతేకాదు తెలివైన స్పిన్నర్ కూడా. పరిస్థితులతో సంబంధం లేకుండా అతను ఎక్కడైనా వికెట్లు తీయగలడు. తాను మైదానంలో ఏం చేయగలడో తనకు తెలుసు. అందుకోసం అతను బాగా వర్కవుట్ చేస్తాడు’ అని అన్నాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో లయాన్ 5 వికెట్లు తీశాడు. భారత్‌పై 5 వికెట్లు తీయడం ఇది ఎనిమిదోసారి.
బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ రెండు టెస్టుల్లో అశ్విన్, జడేజా స్పిన్ ధాటికి ఆస్ట్రేలియా బ్యాటర్లు చేతులెత్తేశారు. స్టంప్స్‌ను అటాక్ చేసిన అశ్విన్, జడ్డూ రెండు మ్యాచుల్లో 31 వికెట్లు పడగొట్టారు. మొదటి టెస్టులో ఈ స్పిన్నర్ల జోడీ 15 వికెట్లు తీయడంతో ఆసీస్ ఇన్నింగ్స్ 132 రన్స్‌తో ఓడిపోయింది. ఢిల్లీ టెస్టులోనే ఈ స్పిన్ ద్వయం చెలరేగిపోయింది. జడ్డూ ఈ మ్యాచ్‌లో పది వికెట్ల ప్రదర్శన చేశాడు. అతను 10 వికెట్లు తీయడం ఇది రెండోసారి.
రెండు టెస్టుల్లో నెగ్గిన భారత్ నాలుగు టెస్టుల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో ఉంది. మూడో టెస్టు ఇండోర్‌లో మార్చి 1న జరగనుంది. ప్రపంచటెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌కు అర్హత సాధించాలంటే ఇండియా ఈ మ్యాచ్ కూడా గెలవాలి. దాంతో, రెండో స్థానంతో దర్జాగా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుతుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా ఫైనల్‌కు బెర్తు ఖరారు చేసుకుంది. ఇంగ్లండ్‌లోని ఓవల్ స్టేడియం వేదికగా జూన్‌లో డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది.