టీమిండియా సారథి రోహిత్ శర్మను సారథ్య బాధ్యతల నుంచి తప్పించాలని భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తకిర వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్-2023 ముందున్న నేపథ్యంలో వీరూ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రోహిత్ ను టీ20 కెప్టెన్ గా తప్పించి టెస్టు, వన్డేలకు మాత్రమే సారథిగా ఉంచాలని సెహ్వాగ్ అన్నాడు.
తాజాగా పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సెహ్వాగ్ మాట్లాడుతూ.. ‘పొట్టి ఫార్మాట్ లో భారత జట్టు పగ్గాలను అప్పగించేందుకు బీసీసీఐ సెలక్టర్ల దృష్టిలో మరొకరు ఉంటే మాత్రం టీ20 సారథ్య బాధ్యతల నుంచి రోహిత్ ను వెంటనే తప్పించాలి. అతడి స్థానంలో సదరు కెప్టెన్ కు ఆ పగ్గాలు అప్పగించాలి. దీంతో రోహిత్ తన పనిభారాన్ని తగ్గించుకుని, పిట్నెస్ ను కాపాడుకునే అవకాశముంటుంది..
టీ20లకు కొత్త కెప్టెన్ ను నియమించడంతో రోహిత్ కు కావాల్సినంత విశ్రాంతి దొరుకుతుంది. అంతేగాక అతడు పునరుత్తేజం పొందుతాడు. తద్వారా టెస్టులు, వన్డేలలో బాగా ఆడటానికి ఆస్కారముంటుంది. రోహిత్ వయసు దృష్ట్యా కూడా బీసీసీఐ ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. అప్పుడే హిట్ మ్యాన్ మిగిలిన రెండు ఫార్మాట్లలో రాణించగలుగుతాడు..’ అని తెలిపాడు.
కాగా ఇప్పటికైతే మూడు ఫార్మాట్లలో ఇద్దరు సారథులు అనే ఫార్ములా ఇండియాకు సెట్ కాదంటూ ఆ విధానాన్ని పట్టించుకోసి బీసీసీఐ.. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోగలదా..? అని వీరూను ప్రశ్నించగా.. ‘ఒకవేళ బీసీసీఐ అదే స్టాండ్ లో ఉంటే మాత్రం మూడు ఫార్మాట్లకు రోహిత్ శర్మ ను ఉంచడమే బెటర్..’ అని పేర్కొనడం గమనార్హం. విరాట్ కోహ్లి తర్వాత టీమిండియా నాయకత్వ పగ్గాలు చేపట్టిన రోహిత్.. ఇప్పటివరకు పూర్తిస్థాయి కెప్టెన్ గా ఒక్క విదేశీ పర్యటన కూడా పూర్తి చేయకపోవడం గమనార్హం.