కోల్‌కతా: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ.. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనోగతాన్ని వివరించారు. తన కెరీర్లో ఎన్నో సెంచరీలను చేసే అవకాశాలను మిస్ అయినట్లు పేర్కొన్నారు. వాస్తవానికి అంతర్జాతీయ క్రికెట్లో గంగూలీ 38 సెంచరీలు చేశారు. కానీ మరికొన్ని సెంచరీలు చేసే అవకాశాన్ని కోల్పోయినట్లు తెలిపారు. ఎడమ చేతి బ్యాటర్ గంగూలీ.. టెస్టులు, వన్డేల్లో కలిపి మొత్తం 18575 రన్స్ చేశారు. అతను 311 వన్డేలు, 113 టెస్టులు ఆడారు. అయితే వీటిల్లో పలు సందర్భాల్లో సెంచరీలు చేసే అవకాశాన్ని చేజార్చుకున్నట్లు చెప్పారు. మీరేదైనా విషయం గురించి చింతిస్తున్నారా అని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ గంగూలీ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎన్నో సెంచరీలు మిస్సయ్యానని, వాస్తవానికి మరిన్ని సెంచరీలు చేయాల్సి ఉందని, ఎన్నోసార్లు 90, 80 రన్స్ స్కోర్ చేసినట్లు తెలిపారు. క్రికెట్ గణాంకాల ప్రకారం సుమారు 30 సార్లు సెంచరీకి చేరువలో గంగూలీ ఔటైనట్లు తెలుస్తోంది. ఒకవేళ గంగూలీ ఆ ఇన్నింగ్స్‌లను సెంచరీలుగా మలిస్తే, అప్పుడు అతను 50 సెంచరీల మైలురాయిని దాటేవాడు. ఒంటరిగా ఉన్న సమయంలో.. బ్యాటింగ్ వీడియోలను చూస్తుంటానని, తన భార్య సారా లండన్‌లో ఉంటుందని, ఆమెకు దూరంగా ఉన్న సమయంలో ఆ వీడియోలు చూస్తానని, యూట్యూబ్‌కు వెళ్లి వీడియోలు చూస్తానని, 70ల్లో ఔట్ అవ్వగానే .. సెంచరీ చేయాల్సి ఉండే అన్న భావన వస్తుందన్నాడు. కానీ గతాన్ని మార్చలేమన్నారు.
వన్డేల్లో గంగూలీ మొత్తం 72 హాఫ్ సెంచరీలు చేశారు. ఇక టెస్టుల్లో 35 అర్థశతకాలు సాధించారు. కెప్టెన్‌గా కొన్ని సందర్భాల్లో కీలకమైన ఆటగాళ్లను డ్రాప్ చేయడం పెద్ద సమస్య అన్నారు. పరిస్థితులకు తగినట్లు ఆ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చేదని, అనిల్ కుంబ్లే గొప్ప బౌలర్ కానీ, పరిస్థితుల వల్ల అతన్ని పలుమార్లు తప్పించాల్సి వచ్చిందన్నారు. తనకు ఆస్ట్రేలియా ఫెవరేట్ ప్రత్యర్థి జట్టు అని, గ్లెన్ మెక్‌గ్రాత్ చాలా ప్రమాదకర బౌలర్ అన్నారు.