హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ) : సైబర్ వేధింపులు తాను కూడా ఎదుర్కొన్నట్లు స్టార్ షట్లర్ పీవీ సింధు తెలిపింది. ఇంటర్నెట్ వినియోగం మన జీవితంలో భాగమైందని వీటిలో విద్య, స్ఫూర్తిదాయక, క్రీడా కార్యక్రమాలతో పాటు మానసిక, వికాస కార్యక్రమాలను పిల్లలు చూసేలా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. రాష్ట్ర మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో ‘మహిళలు, పిల్లలకు సైబర్ వరల్డ్‌పై చైతన్య కార్యక్రమం’అనే అంశంపై శనివారం ఆన్లైన్ ద్వారా ‘ఇస్మార్ట్ సైబర్ చైల్డ్’అవగాహన నిర్వహించారు. మహిళా భద్రతా విభాగం అడిషనల్ డీజీ స్వాతీ లక్రా, ఐజీ సుమతి పాల్గొన్న ఈ కార్యక్రమానికి సింధు అతిథిగా హాజరై ప్రసంగించింది. ‘కొవిడ్-19 నేపథ్యంలో గత రెండేండ్లుగా పెరిగిన ఇంటర్నెట్ వినియోగంతో సైబర్ నేరాలు భారీగా పెరిగాయి. ఇవి ప్రధానంగా మహిళలు, పిల్లల కేంద్రీకృతంగా అధికమయ్యాయి. రాష్ట్రంలో మహిళల భద్రతకు షీటీమ్‌లు ఉన్నాయనే భరోసాను ఎలాగైతే కల్పించాయో, సైబర్ మోసాలకు గురైతే, వెంటనే తమకు సైబర్ వారియర్లు ఉన్నారనే ధైర్యాన్ని కల్పించాలి. సైబర్ నేరాల బారిన పడితే, వెంటనే సమీపంలోని పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేయాలి. నిరంతర శ్రమ, అభ్యాసం ద్వారానే చాంపియన్ తయారవుతారు’అని పేర్కొంది. రాష్ట్రంలో దాదాపు రెండు వేల మంది ఉపాధ్యాయినిలు, 3,500 మంది విద్యార్థినిలకు ఈ శిక్షణ ఇప్పించామని స్వాతి లక్రా తెలిపారు.