MS Dhoni| ఐపీఎల్ జరుగుతున్నప్పుడు గానీ భారత క్రికెట్లో ధోనీ పేరు వచ్చినప్పుడు గానీ అతడి అభిమానుల నోటి నుంచి వినిపించే మాట ‘తలా ఫర్ ఏ రీజన్’ (#Thala For A Reason). గత ఐపీఎల్ ఎడిషన్‌లో అయితే ధోనీ చెన్నై అభిమానులకు ఇదొక మంత్రం. సీఎస్కే మ్యాచ్ ఉన్నప్పుడల్లా సోషల్ మీడియాలో ఇది ట్రెండ్ అయ్యేది. ఇటీవలే భారత్ పదేండ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ ట్రోఫీ నెగ్గినా ధోనీ అభిమానులు ‘ఎక్స్’లో ఈ తలా ఫర్ ఏ రీజన్ ను ట్రెండ్ చేశారు. అయితే తాజాగా దీనిపై చెన్నై సూపర్ కింగ్స్ సారథి, ప్రస్తుతం జింబాబ్వేలో ఉన్న భారత యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ ఆసక్తికర పోస్టు పెట్టాడు.
తన టీ20 అరంగేట్రం నాటి క్యాప్ (88)ను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. ‘ట్రెండ్‌లో నేనే ముందున్నాను’ అని రాసుకొచ్చాడు. అంతేగాక తన క్యాప్ నెంబర్ 88లో 7వ నెంబర్ ఎలా వస్తుందో వివరంగా వెల్లడించాడు. 8+8=16 అయితే 1+6=7 అవుతుందని.. తలా ఫర్ ఏ రీజన్ అని పోస్టులో రాసుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
Ruturaj Gaikwad and his love for MS Dhoni. 😄❤️ pic.twitter.com/Rv108ICil0
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 10, 2024
27 ఏండ్ల ఈ యువ ఆటగాడు జింబాబ్వే పర్యటనలో నిలకడగా రాణిస్తున్నాడు. తొలి మ్యాచ్‌లో విఫలమైనా తర్వాత రెండు మ్యాచ్‌లలోనూ అదరగొట్టాడు. రెండో టీ20లో 47 బంతుల్లోనే 77 పరుగులు చేసిన రుతురాజ్.. బుధవారం ముగిసిన మూడో టీ20లో 28 బంతుల్లోనే 49 పరుగులు చేసి భారత్ భారీ స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. మూడు ఇన్నింగ్స్‌లలో కలిసి 133 రన్స్ చేసిన రుతురాజ్.. త్వరలో జరుగబోయే శ్రీలంక సిరీస్‌లోనూ మెరిస్తే భారత జట్టులో అతడి స్థానాన్ని సుస్థిరం చేసుకున్నట్టే. టీ20లలో కోహ్లీ ఆడే 3వ స్థానంలో బ్యాటింగ్‌కు వస్తున్న రుతురాజ్.. కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతూ భారత బ్యాటింగ్‌కు వెన్నెముకగా నిలుస్తున్నాడు.