మకావు: చైనా వేదికగా జరుగుతున్న మకావు ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో హైదరాబాదీ యువ షట్లర్ తరుణ్ మన్నేపల్లి సంచలన విజయంతో సత్తాచాటాడు. పురుషుల ప్రిక్వార్టర్స్ పోరులో ప్రపంచ 47వ ర్యాంకర్ తరుణ్.. 19-21, 21-14, 22-20తో తనకంటే మెరుగైన ర్యాంకు (15) కల్గిన టాప్‌సీడ్ లీ చెక్ యి (చైనా)ను చిత్తుచేశాడు. సుమారు గంటకు పైగా హోరాహోరీగా జరిగిన పోరులో తరుణ్.. తొలి గేమ్ ఓడినప్పటికీ తర్వాత పుంజుకుని వరుస గేమ్‌లలో ప్రత్యర్థిని చిత్తుచేశాడు. తరుణ్ కెరీర్లో సూపర్ 300 టోర్నీలో క్వార్టర్స్ చేరడం ఇది రెండోసారి. నిరుడు అతడు జర్మన్ ఓపెన్‌లో క్వార్టర్స్ చేరాడు.
క్వార్టర్స్‌లో అతడు.. ప్రపంచ 87వ ర్యాంకర్ హు జె అన్ (చైనా)ను ఢీకొననున్నాడు. మరో సింగిల్స్ మ్యాచ్‌లో భారత నెంబర్ వన్ షట్లర్ లక్ష్యసేన్.. 21-14, 14-21, 21-17తో చికో వర్డొయొ (ఇండోనేషియా)ను ఓడించి క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. పురుషుల డబుల్స్‌లో భారత జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి.. 10-21, 22-20, 21-16తో కుమగై-నిషి (జపాన్)ను ఓడించి క్వార్టర్స్ చేరింది. సింగిల్స్‌లో అయూశ్ శెట్టి పోరాటం ప్రిక్వార్టర్స్‌లోనే ముగిసింది. మహిళల సింగిల్స్‌లో రక్షిత రామ్రాజ్.. 21-14, 10-21, 11-21తో ఆంగ్బమ్రుంగ్ఫన్ (బుసానన్) చేతిలో ఓడింది.