హైదరాబాద్, ఆట ప్రతినిధి : రాజస్థాన్‌తో జరిగిన రంజీ ఎలైట్ గ్రూప్-డీ మ్యాచ్‌ను ఆతిథ్య హైదరాబాద్ డ్రాగా ముగించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం దక్కిన ఆ జట్టు.. రెండో ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థి ఎదుట ఆఖరి రోజు 340 పరుగుల భారీ టార్గెట్‌ను నిర్దేశించింది. ఛేదనలో రాజస్థాన్.. 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 207 రన్స్ చేసి ఓటమి గండం నుంచి తప్పించుకుంది.
ఆ జట్టులో సల్మాన్ ఖాన్ (79), సచిన్ యాదవ్ (44), కెప్టెన్ మహిపాల్ లోమ్రర్ (40) రాణించారు. మ్యాచ్ డ్రాగా ముగియడంతో మూడు పాయింట్లు (మొత్తం 13) సాధించిన హైదరాబాద్.. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. ముంబై (17), జమ్మూకాశ్మీర్ (14) తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి.