కంటోన్మెంట్, డిసెంబర్ 9: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) మరోమారు అభాసుపాలైంది. జింఖానా మైదానం వద్ద హెచ్సీఏ నిర్వహించిన అండర్-14 క్రికెటర్ల సెలెక్షన్ ప్రక్రియ ఉద్రిక్తతకు దారితీసింది. రెండు రోజుల పాటు సెలెక్షన్స్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన హెచ్సీఏ అందుకు తగ్గట్లు కనీస ఏర్పాట్లు చేయడంలో ఘోరంగా విఫలమైంది. నగరంతో పాటు వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో క్రికెటర్లు వారి తల్లిదండ్రులు రావడంతో జింఖానా మైదానం పరిసర ప్రాంతాలు మొత్తం కిక్కిరిసిపోయాయి.
గ్రౌండ్లోకి అనుమతించకపోవడంతో బరువైన కిట్లతో బాలబాలికలు నడిరోడ్డుపై ఎండలో పడిగాపులు పడాల్సి రావడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న బేగంపేట ఏసీపీ గోపాలకృష్ణమూర్తి జింఖానాకు వచ్చి కనీసం సమాచారం ఇవ్వకపోవడంపై హెచ్సీఏ అధికారులను మందలించారు. టోకెన్ పద్ధతిలో బుధవారం ఎంపిక ప్రక్రియ జరిగేటట్లు చర్య తీసుకుంటామని ఏసీపీ వెల్లడించారు.