డెహ్రాడూన్: రంజీ టోర్నీలో హైదరాబాద్ వరుస ఓటముల పరంపర కొనసాగుతున్నది. తమ తొలి మ్యాచ్‌లో గుజరాత్ చేతిలో కంగుతిన్న హైదరాబాద్..తాజాగా ఉత్తరాఖండ్‌పై ఓటమి పాలైంది. సోమవారంతో ముగిసిన మ్యాచ్‌లో హైదరాబాద్ 78 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. ఉత్తరాఖండ్ నిర్దేశించిన 269 పరుగుల లక్ష్యఛేదనలో హైదరాబాద్ 190 పరుగులకు కుప్పకూలింది. స్వప్నిల్సింగ్ (6/59) ధాటికి హైదరాబాద్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది.
రోహిత్రాయుడు(47 నాటౌట్), తన్మయ్ అగర్వాల్ (38), అభిరాత్రెడ్డి (35) మినహా అందరూ ఘోరంగా విఫలమయ్యారు. స్వప్నిల్ స్పిన్ విజృంభణతో మన బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 189/5తో రెండో ఇన్నింగ్స్‌కు దిగిన ఉత్తరాఖండ్ 235 పరుగులు చేసింది. మిలింద్ (3/31), తనయ్ త్యాగరాజన్ (2/62), రోహిత్రాయుడు (2/27) రాణించారు.