హైదరాబాద్, ఆట ప్రతినిధి: చాలా రోజుల తర్వాత హైదరాబాద్ క్రికెట్‌కు మళ్లీ మంచి రోజులు వచ్చాయి. అవును సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ హైదరాబాద్ క్రికెట్ జట్టు ఆల్ఇండియా బుచ్చిబాబు ఇన్విటేషన్ టోర్నీలో విజేతగా నిలిచింది. బుధవారం ముగిసిన ఫైనల్లో ఛత్తీస్‌గఢ్‌పై 243 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఈ క్రమంలో ఏడేండ్ల తర్వాత హైదరాబాద్ బుచ్చిబాబు టోర్నీలో తిరిగి టైటిల్ దక్కించుకోవడం విశేషం. మ్యాచ్ విషయానికొస్తే..హైదరాబాద్ నిర్దేశించిన 518 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ఛత్తీస్‌గఢ్ రెండో ఇన్నింగ్స్‌లో 61.1 ఓవర్లలో 274 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు ఆయూశ్ పాండే(117), శశాంక్ చంద్రకర్(50) రాణించారు. వీరిద్దరు కలిసి తొలి వికెట్‌కు 103 బంతుల్లో 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే స్పిన్నర్ తనయ్ త్యాగరాజన్(5/61) ఐదు వికెట్ల విజృంభణతో ఛత్తీస్‌గఢ్ పతనాన్ని శాసించాడు. ఒకానొక దశలో మెరుగ్గా కనిపించిన ఛత్తీస్‌గఢ్..హైదరాబాద్ బౌలర్ల ధాటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది.
హైదరాబాద్ భేష్-జగన్ అభినందన: బుచ్చిబాబు టోర్నీ విజేతగా నిలిచిన హైదరాబాద్ జట్టును అధ్యక్షుడు జగన్మోహన్రావు, కార్యదర్శి దేవరాజ్ ప్రత్యేకంగా అభినందించారు. విజయంలో కీలకంగా వ్యవహరించిన రోహిత్రాయుడు, రాహుల్‌సింగ్, అభిరత్రెడ్డి, తనయ్ త్యాగరాజన్, అనికేత్రెడ్డిని ప్రశంసించారు. హైదరాబాద్ చేరుకున్నాక జట్టు సభ్యులను ఘనంగా సన్మానించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జగన్ పేర్కొన్నారు.