గతమెంతో ఘన చరిత్ర కల్గిన హైదరాబాద్ క్రికెట్లో మరో కలికితురాయి చేరింది. హెచ్‌సీఏ ప్రతిష్టను ఇనుమడింపజేస్తూ మన హైదరాబాద్ కుర్రాళ్లు సత్తాచాటారు. ఇటీవల రాజ్‌కోట్‌లో జరిగిన విను మన్కడ్ ట్రోఫీలో హైదరాబాద్ టైటిల్ విజేతగా నిలువడంలో యువ క్రికెటర్లు కీలకంగా వ్యవహరించారు. అండగా నిలిస్తే అద్భుతాలు సృష్టిస్తామని నిరూపిస్తూ చాలా ఏండ్ల తర్వాత హైదరాబాద్‌కు బీసీసీఐ ట్రోఫీని అందజేశారు. 1937-38, 1986-87 రంజీ ట్రోఫీ టైటిళ్ల తర్వాత హైదరాబాద్‌కు దక్కిన మూడో బీసీసీఐ ట్రోఫీ విను మన్కడ్ కావడం విశేషం. రాజ్‌కోట్ వేదికగా ఈనెల 1వ తేదీన జరిగిన ఫైనల్ పోరులో హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో పంజాబ్‌పై గెలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది. కోచ్ భవనక సందీప్ శిక్షణలో రాటుదేలిన యువ క్రికెటర్లు హైదరాబాద్ క్రికెట్‌కు చుక్కానిలా కనిపిస్తున్నారు. సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటిన హైదరాబాద్ టీమ్ విజయంలో కెప్టెన్ ఆరోన్ జార్జ్, వైస్ కెప్టెన్ అలంకిృత్ రాపోలు, యశ్వీర్గౌడ్, వఫీ కచ్చి కీలకంగా వ్యవహరించారు. విను మన్కడ్ ట్రోఫీ హైదరాబాద్‌కు దక్కడంలో కీలకమైన వీరిపై ప్రత్యేక కథనం.
ఆరోన్ జార్జ్ : వినుమన్కడ్ ట్రోఫీలో ఆరోన్…హైదరాబాద్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. హైదరాబాద్ అండర్-19 టీమ్ తరఫున గత నాలుగు సీజన్లలో ప్రాతినిధ్యం వహించాడు. లీగ్‌లో తన అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన కొనసాగిస్తూ ఆరోన్ 373 పరుగులతో టోర్నీ టాపర్‌గా నిలిచాడు. ఆరేండ్ల వయసులో ప్లాస్టిక్ బంతితో క్రికెట్ మొదలుపెట్టిన ఆరోన్ ఎనిమిదేండ్ల నుంచి కోచింగ్ తీసుకున్నాడు. 2022-23లో హైదరాబాద్ అండర్-16 టీమ్తరఫున విజయ్ మర్చంటట్ టోర్నీ ఆడాడు. బీహార్‌పై 303 పరుగులతో అదరగొట్టాడు.
యశ్వీర్గౌడ్ : టోర్నీలో ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో లెఫ్టార్మ్ స్పిన్నర్ యశ్వీర్గౌడ్ 15 వికెట్లతో సత్తాచాటాడు. ఇందులో రెండుసార్లు నాలుగు వికెట్ల ప్రదర్శన కనబరిచాడు. ఫైనల్లో పంజాబ్‌పై 3/22 ప్రదర్శనతో యశ్వీర్.. హైదరాబాద్ విజయంలో కీలకంగా వ్యవహరించాడు. హైదరాబాద్ తరఫున అండర్-16, 19 టీమ్‌ల్లో యశ్వీర్ నిలకడగా రాణించాడు. రిషబ్ పంత్, జడేజాను అభిమానించే యశ్వీర్ స్పిన్‌తో పాటు లోయార్డర్‌లో ఉపయుక్తమైన బ్యాటర్ కూడా కావడం విశేషం.

వఫీ కచ్చి : హైదరాబాద్‌కు మరో ఆల్‌రౌండర్ వఫీ కచ్చి రూపంలో రాబోతున్నాడు. విను మన్కడ్ ట్రోఫీలో ఆరు మ్యాచ్‌ల్లో ఓపెనింగ్‌కు వచ్చిన వఫీ 281 పరుగులతో ఆకట్టుకున్నాడు. కేవలం బ్యాటింగ్ వరకే పరిమితం కాకుండా స్పిన్ బౌలింగ్‌లో 11 వికెట్లు తీసి ఔరా అనిపించుకున్నాడు. త్రిపురతో పోరులో ఐదు వికెట్లు తీసిన వఫీ..హిమాచల్‌ప్రదేశ్‌పై 164 పరుగులతో విజృంభించాడు. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌ను ఆరాధించే వఫీ..భవిష్యత్‌లో భారత్‌కు ఆడాలనే పట్టుదలతో చెమటోడుస్తున్నాడు.
అలంకిృత్ రాపోలు : పంజాబ్‌తో ఫైనల్లో 112 పరుగుల లక్ష్యఛేదనలో హైదరాబాద్ 8/2 ఉన్న సమయంలో క్రీజులోకొచ్చిన వైస్ కెప్టెన్ అలంకిృత్(58 నాటౌట్) అజేయ అర్ధసెంచరీతో జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. 26 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన స్థితిలో ఆరో వికెట్‌కు అవేజ్ అహ్మద్‌తో కలిసి ఆరో వికెట్‌కు అజేయంగా 86 పరుగులు జోడించి జట్టును గెలిపించాడు. 12 ఏండ్ల వయసులో క్రికెట్లోకి అడుగుపెట్టిన అలంకిృత్ వచ్చే ఏడాది జరిగే అండర్-19 ప్రపంచకప్‌లో చోటే లక్ష్యంగా ముందుకు వెళుతున్నాడు.