హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రైమ్ వాలీబాల్ లీగ్(పీవీఎల్)లో హైదరాబాద్ బ్లాక్‌హాక్స్‌కు చుక్కెదురైంది. శుక్రవారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 0-3(10-15, 14-16, 15-17)తో ఢిల్లీ తూఫాన్స్ చేతిలో ఓటమిపాలైంది. మ్యాచ్‌లో మొదటి నుంచే ఒకింత తడబడ్డ హైదరాబాద్ పుంజుకుని పోటీలోకి వచ్చినా లాభం లేకపోయింది.
ఢిల్లీ ప్లేయర్ కార్లోస్ తన సూపర్ సర్వ్‌లతో బ్లాక్‌హాక్స్‌కు పరీక్ష పెట్టాడు. మరోవైపు సెంటర్లో ఆనంద్..ఢిల్లీకి కీలకంగా వ్యవహరించాడు. ఈ మ్యాచ్‌కు రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, సాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పీవీఎల్‌తో దేశంలో వాలీబాల్‌కు మరింత ఆదరణ పెరుగుతుందని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఫ్రాంచైజీ యజమాని అభిషేక్‌రెడ్డి పాల్గొన్నారు.