సింగపూర్: భారత సీనియర్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ సింగపూర్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో సంచలన విజయం సాధించాడు. ప్రపంచ 5వ ర్యాంకర్, ఇండోనేషియా స్టార్ జొనాథన్ క్రిస్టీకి షాకిచ్చాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో తొలి గేమ్ కోల్పోయినా అద్భుతంగా పుంజుకొని ఆడిన ప్రణయ్ 10-21, 21-12, 21-18 తేడాతో క్రిస్టీపై గెలిచి ప్రి క్వార్టర్స్ చేరాడు.
మరో మ్యాచ్‌లో లక్ష్యసేన్ 21-17, 21-15తో వరుస గేమ్స్‌లో చైనాకు చెందిన లూ గువాంగ్ జును చిత్తు చేయగా.. మాజీ వరల్డ్ నంబర్‌వన్ కిదాంబి శ్రీకాంత్ 20-22, 21-19, 17-21తె సింగపూర్ స్టార్ లో కీన్ యూ చేతిలో పోరాడి ఓడిపోయాడు. కాగా, మిక్స్డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిల – తనీషా క్రాస్టో జోడీ 21-14, 20-22, 21-13 తేడాతో మలేషియాకు చెందిన వాంగ్ తియెన్ చి – లిమ్ చివ్ సియెన్ ద్వయంపై విజయం సాధించింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో మాళవిక బన్సోద్ 21-11, 19-21, 12-21తో తైపీ షట్లర్ లిన్ హిసియాంగ్ చేతిలో పోరాడి ఓడింది.