న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోనీకి ఐపీఎల్లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌కు ఆడుతున్న ధోనీ.. ప్రతి సీజన్లో మొత్తం పరుగులు, సిక్సర్లు, బౌండరీలు, ఔట్లు, హాఫ్ సెంచరీలు ఇలా అన్ని అంశాల్లో చెప్పుకోదగ్గ గణాంకాలే నమోదు చేస్తూ వచ్చాడు. అయితే కేవలం సెంచరీ చేసే అవకాశం మాత్రమే అతనికి రాలేదు. ఈ నేపథ్యంలో 2023 ఐపీఎల్ సీజన్లో ధోనీ ప్రదర్శన ఎలా ఉంది..? అంతకుముందు ఐపీఎల్ సీజన్లలో అతను ఎలాంటి ఆట తీరు కనబర్చాడు అనే విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఈ ఐపీఎల్ సీజన్లో ధోనీ కేవలం 104 పరుగులు మాత్రమే చేశాడు. మొత్తం 16 ఐపీఎల్ సీజన్లలో ఏ ఒక్క సీజన్లోనూ ధోనీ ఇంత తక్కువ టోటల్‌ను నమోదు చేయలేదు. ఈ సీజన్లో ఎప్పుడూ 15 ఓవర్ల కంటే ముందు ధోనీకి బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోవడంతో అతను ఎక్కువ పరుగులు రాబట్టలేకపోయాడు. పరుగులు తక్కువైనా ఈ సీజన్లో ధోనీ స్ట్రైక్ రేట్ 182.46గా ఉన్నది. మొత్తం 16 ఐపీఎల్ సీజన్లలో ధోనీకి ఇదే అత్యుత్తమ స్ట్రైక్ రేట్.
కాగా, ధోనీ ఇప్పటివరకు మొత్తం 250 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. అందులో 2012 సీజన్లో అత్యధికంగా 19 మ్యాచ్‌లలో పాల్గొన్నాడు. అన్ని సీజన్లలో కలిపి 5,082 పరుగులు చేసిన ధోనీ.. 2013 సీజన్లో అత్యధికంగా 461 పరుగులు రాబట్టాడు. ఇక ధోనీ ఐపీఎల్ కెరీర్లో 2019లో నమోదైన 84 పరుగులే అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు. ధోనీ కెరీర్లో ఒక్క సెంచరీ లేకపోయినా 24 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
కెరీర్ మొత్తంలో 349 బౌండరీలు, 239 సిక్సర్లు బాదిన ధోనీ.. 2008లో తొలి ఐపీఎల్లో అత్యధికంగా 38 బౌండరీలు, 2018లో అత్యధికంగా 30 సిక్సర్లు సాధించాడు. అంతేగాక ఐపీఎల్ అన్ని సీజన్లలో కలిపి ధోనీ 142 క్యాచ్ అవుట్లు, 42 స్టంప్ ఔట్లు చేశాడు. 2013, 2020 సీజన్లలో అత్యధికంగా తొమ్మిదేసి క్యాచ్‌ల చొప్పున పట్టాడు. ఈ సీజన్లో మొత్తం మూడు స్టంప్ ఔట్లు చేయగా.. అత్యధికంగా 2019 ఐపీఎల్ సీజన్లో 5 స్టంప్ ఔట్లు చేశాడు.