రాజ్‌గిర్(బీహార్): ప్రతిష్టాత్మక ఆసియాకప్ హాకీ టోర్నీలో ఆతిథ్య భారత్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన తమ ఆఖరి సూపర్-4 మ్యాచ్‌లో భారత్ 7-0 తేడాతో చైనాపై ఘన విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, ఒక డ్రాతో ఏడు పాయింట్లు ఖాతాలో వేసుకున్న టీమ్ఇండియా..టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లింది.
ఆదివారం జరిగే ఆసియాకప్ ఫైనల్లో రెండో స్థానంలో నిలిచిన డిఫెండింగ్ చాంపియన్ కొరియా(4)తో భారత్ తలపడుతుంది. మ్యాచ్ విషయానికొస్తే ఆది నుంచే భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. దూకుడైన స్రైక్టింగ్కు తోడు పటిష్టమైన డిఫెన్స్‌తో చైనాకు చుక్కలు చూపించారు.
ఏ దశలోనూ వెనుకకు తగ్గని భారత్ తరఫున అభిషేక్(46ని, 50ని) డబుల్ గోల్స్‌తో చెలరేగగా, శీలానంద్ లక్రా(4ని), దిల్‌ప్రీత్‌సింగ్(7ని), మన్‌దీప్‌సింగ్(18ని), రాజ్కుమార్పాల్(37ని), సుఖ్జీత్సింగ్(39ని) ఒక్కో గోల్స్ చేశారు. మ్యాచ్ మొదలైన నాలుగో నిమిషంలోనే శీలానంద్ గోల్‌తో భారత్ ఖాతా తెరువగా, ఆఖరి వరకు అదే జోరు కొనసాగిస్తూ గోల్స్ చేసింది.