Rohit Sharma : ఛాంపియన్స్ ట్రోఫీ – 2025 (Champions Trophy 2025) లో వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచిన టీమిండియా (Team India) మంచి ఊపు మీద ఉంది. మార్చి 2న న్యూజిలాండ్ (New Zealand) తో జరగబోయే ఆఖరి లీగ్ మ్యాచ్‌లోనూ గెలువాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) అకాడమీలో నెట్ ప్రాక్టీస్ (Net practice) చేస్తోంది. ఈ ప్రాక్టీస్ సెషన్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) హాజరుకాలేదు. దాంతో రోహిత్‌కు ఏమైందా అని ఆయన ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
పాకిస్థాన్‌పై విజయం తర్వాత భారత ఆటగాళ్లు మొదటిసారి ఐసీసీ ఆకాడమీలో నెట్ ప్రాక్టీస్ చేశారు. ఈ సందర్భంగా ఫుట్‌బాల్ ఆడారు. రన్నింగ్ చేశారు. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ ఈ ప్రాక్టీస్ సెషన్లో పాల్గొనలేదు. కండిషనింగ్ కోచ్ సోహమ్ దేశాయ్ పర్యవేక్షణలో రోహిత్ నెమ్మదిగా జాగింగ్ మాత్రమే చేశారు. పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌కు తొడ కండరాల గాయం ఇబ్బంది పెట్టిందట. అందుకే ఆయన ప్రాక్టీస్ సెషన్లో చురుగ్గా పాల్గొనలేదట. ప్లేయర్స్ ప్రాక్టీస్ చేస్తుండగా రోహిత్ శర్మ భారత ప్రధాన కోచ్ గంభీర్, ఇతర సిబ్బందితో చర్చిస్తూ కనిపించాడు.
ఈ ప్రాక్టీస్ సెషన్లో విరాట్ కోహ్లీ, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా వంటి స్పిన్నర్లను ఎదుర్కొన్నాడు. వారి ఓవర్లలోనే ఎక్కువ సేపు ప్రాక్టీస్ చేశాడు. అలాగే టీమిండియా పేసర్ మహ్మద్ షమీ బంతిని రెండు వైపులా స్వింగ్ చేస్తూ బౌలింగ్ వేశాడు. షమీ వేసిన బంతులు రెండుసార్లు కోహ్లీ ప్యాడ్‌ను తాకాయి. హర్షిత్ రాణా, అర్ష్ దీప్ సింగ్ కూడా నెట్స్‌లో చెమటోడ్చారు. ఛాంపియన్స్ ట్రోఫీలో అదరగొడుతున్న శుభ్‌మన్ గిల్ మాత్రం ప్రాక్టీస్ సెషన్‌కు రాలేదు.
ఇదిలావుంటే వ్యక్తిగత కారణాల వల్ల స్వదేశానికి వెళ్లిన బౌలింగ్ కోచ్ మోర్న్ మార్కెల్ తిరిగి జట్టుతో కలిశాడు. ప్రాక్టీస్ సెషన్ సమయంలో ఆయన హెడ్ కోచ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మతో ఏదో చర్చిస్తూ కనిపించాడు.