Renuka Singh | ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఫాస్ట్ బౌలర్ రేణుకా సింగ్‌కు హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం నజరానా ప్రకటించింది. రూ.కోటి పారితోషకాన్ని ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు సోమవారం ఈ నజరానాను ప్రకటించారు. రేణుకా ప్రతి పర్వతప్రాంతం అమ్మాయి కలను నెరవేర్చిందని సీఎం పేర్కొన్నారు. పోరాటాలను అధిగమించి ప్రపంచ కప్ గెలిచిన జట్టులో భాగం కావడం దేశానికి, హిమాచల్‌కు గర్వకారణమన్నారు.
రేణుక అభిరుచి, నమ్మకంతో ప్రతి లక్ష్యాన్ని సాధించవచ్చని చూపించిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రేణుకతో పాటు ఆమె కుటుంబాన్ని సీఎం అభినందించారు. రేణుక దివంగత తండ్రికి తాను సెల్యూట్ చేస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు. ఆయన ఇచ్చిన ప్రేరణ నేడు మొత్తం హిమాచల్‌కు గర్వకారణంగా మారిందన్నారు. రేణుకా సింగ్‌తో సీఎం ఫోన్లో మాట్లాడారు. ప్రపంచ కప్‌లో విజయం సాధించిన భారత మహిళా క్రికెట్ జట్టును సైతం ఆయన అభినందించారు. ప్రపంచ కప్‌లో రేణుక ప్రదర్శనను కూడా ముఖ్యమంత్రి ప్రశంసించారు.