Uppal Stadium | హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): ఉప్పల్లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ప్రపంచకప్ మ్యాచ్ల నిర్వహణకు ఆటంకంగా ఉన్న వాణిజ్య వివాదాల కోర్టు ఉత్తర్వులను హైకోర్టు ఎత్తివేసింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) ఆస్తులతోపాటు బ్యాంకు ఖాతాల జప్తునకు జారీ అయిన ఉత్తర్వులను తొలగిస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
కింది కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో 6 వారాల్లోగా వాణిజ్య వివాదాల కోర్టులో రూ.17.5 కోట్లు జమ చేయాలని హెచ్సీఏని ఆదేశించింది. నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి, తదుపరి విచారణను వాయిదా వేసింది.