ఢిల్లీ: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ (బీజీటీ)లో ఆస్ట్రేలియా చేతిలో 1-3తో సిరీస్ కోల్పోవడం కంటే స్వదేశంలో భారత జట్టు కివీస్ చేతిలో వైట్‌వాష్ అవడమే అత్యంత బాధాకరమని మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు. బీజీటీ సిరీస్ పరాభవం నేపథ్యంలో యువీ మాట్లాడుతూ.. ‘నా వరకైతే స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 0-3తో ఓడటమే అత్యంత బాధాకరం. అది ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదు. ఇక ఆసీస్ సిరీస్ విషయానికొస్తే అక్కడ మనం గత రెండు పర్యటనలలో విజయాలు సాధించాం.
ఈసారి ఓడిపోయాం’ అని అన్నాడు. ఆసీస్ సిరీస్‌లో రోహిత్, కోహ్లీ వైఫల్యాల తర్వాత వారిపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో యువరాజ్ స్పందిస్తూ.. ‘మన కాలపు గొప్ప క్రికెటర్లలో రోహిత్, కోహ్లీ తప్పకుండా ఉంటారు. వారిపై చాలా చెడుగా మాట్లాడుతున్నారు.త్వరలోనే వాళ్లిద్దరూ మళ్లీ పుంజుకుంటారన్న నమ్మకం నాకుంది’ అని అన్నాడు.