ముంబై : హర్మన్‌ప్రీత్ నేతృత్వంలోని టీమిండియా మహిళల క్రికెట్ జట్టు వన్డే వరల్డ్‌కప్ గెలిచిన విషయం తెలిసిందే. భారత మహిళల జట్టు సాధించిన కీర్తి వెనుక అమొల్ మొజందార్ పాత్ర ఎంతో కీలకమైంది. మహిళల జట్టు కోచ్‌గా అమొల్ మొజందార్ .. భారత బృందాన్ని శక్తివంతంగా తీర్థిదిద్దారు. ముంబై క్రికెటర్ అయిన మొజుందార్.. గతంలో ఇండియాకు ఆడలేదు. కానీ ఆయనకు స్వదేశీ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో విశేష అనుభవం ఉన్నది. ఫస్ట్ క్లాస్‌లో 11,167 రన్స్ చేశాడు. జాతీయ జట్టుకు ఆడకపోయినా.. మొజందార్ మాత్రం తన కలలను సాకారం చేసుకున్నాడు. ఇండియాకు వరల్డ్‌కప్ వచ్చేలా ప్రయత్నించాడు. వరల్డ్‌కప్ గెలిచిన హర్మన్ బృందానికి కోచ్‌గా ఎనలేని గురు బాధ్యతలను ఆయన పోషించారు.
ముంబై జట్టు తరపున రంజీ అరంగేట్రం మ్యాచ్‌లో మొజుందార్ ఇరగీశాడు. ఆ మ్యాచ్‌లో 260 రన్స్ స్కోర్ చేశాడు. అయితే మొజుందార్ క్రికెట్ కెరీర్ ఆయనకు అనుకూలించలేదు. ఆ సమయంలో భారత జట్టులో సచిన్, ద్రావిడ్, లక్ష్మణ్, గంగూలీ లాంటి హేమాహేమీలు ఉండేవారు. దీంతో ఆయనకు జాతీయ జట్టు మిడిల్ ఆర్డర్లో చోటు దక్కలేదు. కేవలం ఫస్ట్ క్లాస్‌కే పరిమితమైన మొజుందార్.. 2014లో రిటైర్మెంట్ తీసుకున్నాడు. 21 ఏళ్ల పాటు అతను ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు. కానీ ఫస్ట్ క్లాస్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన 11 ఏళ్ల తర్వాత.. భారత బ్యాటింగ్ బరువును తన భుజాలపై మోసాడతను. మహిళల జట్టు వన్డే వరల్డ్ కప్ గెలవడానికి ఆయన అనుభవం ఎంతగానో పనిచేసింది.
హర్మన్ టీం వరల్డ్‌కప్ గెలవడం పట్ల హెడ్ కోచ్ మొజుందార్ సంతోషం వ్యక్తం చేశారు. ఆ ఆనందాన్ని ఆయన గ్రౌండ్‌లోనే పంచుకున్నారు. భావోద్వేగంతో జాతీయ జెండాను పట్టుకుని రెపరెపలాడించారు. మాటలు రావడం లేదని, గర్వంగా ఉందని, ఈ సంతోషానికి ఆ అమ్మాయిలు అర్హులు అని ట్రోఫీ గెలిచిన తర్వాత మొజుందార్ అన్నారు. హార్డ్‌వర్క్, నమ్మకం కలిసివచ్చాయని, ఆ అమ్మాయిలు ప్రతి భారతీయుడిని గర్వంగా నిలిపారన్నారు.
2023లో భారత మహిళల క్రికెట్ జట్టుకు కోచ్‌గా అమొల్ మొజుందార్ బాధ్యతలు స్వీకరించారు. టీమ ప్రదర్శన పట్ల ఆయన టోర్నీ మొత్తం హర్షం వ్యక్తం చేశారు. ఆరంభంలో ఒడిదుడుకులు ఎదురైనా, వెనక్కి తగ్లేదన్నారు. దాదాపు చాలా మ్యాచుల్లో డామినేట్ చేశామన్నారు. బెటర్‌గా ఫినిష్ చేయాలన్న ఉద్దేశాన్ని వ్యక్తం చేశానన్నారు. ఫైనల్లో షఫాలీ వర్మ పర్ఫార్మెన్స్ను మొజుందార్ మెచ్చుకున్నాడు. ఆమె అద్భుతం సృష్టించిందన్నారు. 87 రన్స్ చేయడమే కాదు, కీలకమైన రెండు వికెట్లు తీసుకున్నట్లు చెప్పారు. సెమీ ఫైనల్, ఫైనల్, కిక్కిరిసిన స్టేడియంలో..షఫాలీ రాణించిన తీరు ప్రశంసనీయమన్నారు.
మహిళా జట్టును తీర్చిదిద్దేందుకు మొజుందార్ తీవ్రంగా శ్రమించారు. ఫిట్నెస్, ఫీల్డింగ్ అంశాల్లో ఆయన వచ్చీరాగానే ఫోకస్ పెట్టారు. తన కోచింగ్ విజన్‌లో ఈ రెండింటికి కీలక ప్రాధాన్యత ఇచ్చారు. డ్రెస్సింగ్ రూమ్‌లో దీని గురించే ఎక్కువ చర్చ జరిగేదన్నారు. అయితే ఫైనల్ మ్యాచ్ సమయంలో గ్రౌండ్లో అమ్మాయిలు ప్రదర్శించిన ఆ ఎనర్జీ వారిని ఛాంపియన్లుగా నిలిపినట్లు ఆయన పేర్కొన్నారు. ఆటగాళ్లను ఇంత కన్నా కోరేది ఏమీ ఉండదన్నారు. క్రికెట్లో సుదీర్ఘ కెరీర్ ఉన్న మొజందార్ వాస్తవానికి యువకుడిగా జాతీయ జట్టుకు ఆడలేకపోయారు. కానీ మహిళా బృందం చాంపియన్లుగా ఆవిర్భవించడానికి ఆయన అనుభం కలిసివచ్చింది.
ఫైనల్లో సాధించిన విజయం భారత క్రికెట్ లో ఓ చరిత్రగా మిగిలిపోతుందన్నారు. కేవలం మహిళా క్రికెట్‌కు మాత్రమే ఇది శాశ్వతం కాదన్నారు. రెండేళ్ల పాటు హర్మన్ టీమ్ చాలా శ్రమించిందన్నారు. ప్రణాళికలను పకడ్బందీగా వేశారని, ప్రదర్శన టాప్ స్థాయిలో ఉండే రీతిలో ప్రిపేరయ్యారన్నారు. యువకుడిగా ఉన్న రోజుల్లో మీరు భారత జట్టుకు ఆడలేకపోయినందుకు బాధపడుతున్నారా అని అడిగిన ప్రశ్నకు అమొల్ మొజుందార్ బదులిస్తూ … అదేమీ లేదని, తానేమీ హీరోను కాదని నవ్వేశారు.
1988లో సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీలు.. ముంబై జట్టుకు భారీ స్కోరు అందించారు. ఆ ఇద్దరు క్రికెటర్లు భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ ఇద్దరే రెండు రోజులు ఆడారు. ఆ సమయంలో బ్యాటింగ్ కోసం ప్యాడ్స్ కట్టుకుని రెండు రోజులు అలాగే కూర్చున్న వ్యక్తే అమొల్ మొజుందార్. అప్పుడు ప్రదర్శించిన ఆ నిరీక్షణ.. ఇప్పుడు ఇలా వరల్డ్‌కప్ రూపంలో కలిసి రావడం.. ఆ ఘనత మొజుందార్కే దక్కుతుంది.
ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో మొజుందార్ 48.13 సగటుతో 11,167 రన్స్ చేశాడు. 1994లో అండర్19 వరల్డ్‌కప్‌కు భారత వైస్ కెప్టెన్‌గా చేశాడు. ఇండియా ఏ టీమ్‌లో ఆడాడు. రంజీ టోర్నీల్లో ముంబై 8 సార్లు టైటిల్ గెలిచిన జట్టులోనూ మొజుందార్ ఉన్నారు. గతంలో అండర్19, అండర్23 కోచింగ్ స్టాఫ్‌గా ఉన్నారు. నెదర్లాండ్స్ క్రికెట్ జట్టుకు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా చేశారు.
భారతీయ మహిళా క్రికెటర్ల శక్తిని ప్రపంచానికి చూపించారు అమొల్ మొజుందార్.. ఇప్పుడు ఆయన్ను ‘అన్మోల్*’మొజందార్ అన్నా అతిశయోక్తి కాదు.