న్యూఢిల్లీ: భారత యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌కు (Shubman gill) అద్భుత భవిష్యత్తు ఉందని.. మాజీ ఆల్‌రౌండర్ సురేశ్ రైనా (Suresh Raina) పేర్కొన్నాడు. గత కొంత కాలంగా.. నిలకడగా రాణిస్తున్న గిల్.. ఇటీవల ముగిసిన ఆసియాకప్‌లో 75.50 సగటుతో 302 పరుగులు చేశాడు. స్టార్ ఆటగాళ్లెందరో పాల్గొన్న ఈ టోర్నీలో శుభ్‌మన్ టాప్ స్కోరర్‌గా నిలువడం గమనార్హం. భారత భవిష్యత్తు స్టార్ అని ఇప్పటికే పలువురితో ప్రశంసలు అందుకున్న గిల్‌పై మాజీ ఆల్‌రౌండర్ సురేశ్ రైనా కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శుభ్‌మన్ తదుపరి విరాట్ కోహ్లీ (Virat Kohli) కావాలనుకుంటున్నాడని అభిప్రాయపడ్డాడు. స్వదేశంలో జరుగనున్న వన్డే ప్రపంచకప్‌లో అతి ముఖ్యమైన ఆటగాళ్ల జాబితాలో గిల్ తప్పక ఉంటాడని రైనా అన్నాడు.
‘శుభ్‌మన్ గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్నాడు. వెస్టిండీస్ టూర్లో ఇబ్బంది పడ్డట్లు కనిపించినా.. అది పెద్ద ఇబ్బందేం అనిపించలేదు. ఆసియాకప్‌లో మునుపటి జోరు అందుకోవడం సంతోషం. కీలక టోర్నీలో బాగా రాణించాడు. సునాయాసంగా అర్ధశతకాలు, శతకాలు సాధిస్తున్నాడు. వన్డే వరల్డ్ కప్‌లో అతడి ఆటతీరు కీలకం అవుతుంది అనడంలో సందేహం లేదు. అతడు స్టార్ గా ఎదగాలి అనుకుంటున్నాడు. తదుపరి విరాట్ కోహ్లీ కావాలనుకుంటున్నాడు. ఇప్పటికే అలాంటి వాతావరణం ఏర్పడింది’ అని రైనా పేర్కొన్నాడు. ఇక మీడియా సైతం విరాట్‌ను కింగ్ అని.. శుభ్‌మన్‌ని ప్రిన్స్ అని అభివర్ణిస్తున్న విషయం తెలిసిందే. గిల్ హ్యాండ్ పవర్ చాలా బలమైదనదని.. దాన్ని చక్కగా వినియోగిస్తూ అతడు పరుగుల వరద పారిస్తున్నాడని రైనా అన్నాడు.