JPL : కేఎస్‌జీ జర్నలిస్టు ప్రీమియర్ లీగ్ (JPL) జెర్సీల ఆవిష్కరణ వేడుకగా ఘనంగా జరిగింది. శనివారం ఉదయం సికింద్రాబాద్ జింఖానా స్టేడియంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అధ్యక్షుడు జగన్మోహన్ రావు (Jaganmohan Rao), చెన్నూర్ ఎమ్మెల్యే జి.వివేక్ వెంకటస్వామి (Vivek Venkataswamy) లు ముఖ్య అతిథులుగా హాజరై జెర్సీలను విడుదల చేశారు.
ఈ సందర్భంగా హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్ మాట్లాడుతూ.. క్రీడారంగం అభివృద్ధి, క్రీడాకారుల అభ్యున్నతికి నిత్యం పరితపించే జర్నలిస్టులే ఆటగాళ్లుగా మారిపోయి గ్రౌండ్లోకి దిగడం చూస్తుంటే సంతోషంగా ఉందని అన్నారు. ఈ టోర్నీలో తలపడుతున్న అన్ని జట్లకు ఆయన ఆల్ ద బెస్ట్ తెలిపారు. ఆ తర్వాత ఎమ్మెల్లే వివేక్ మాట్లాడుతూ జర్నలిస్ట్‌లు సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతారని అన్నాడు.
‘జర్నలిస్టులతో నా అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పాత్రికేయలు నాకు మిత్రులుకాదు.. కుటుంబ సభ్యులు వంటి వారు. సమాజ హితం కోసం వారు చూపించే చొరవ అందరికి ఆదర్శప్రాయం. జేపీఎల్ విజయవంతం కావాలని కోరుకుంటున్నా’ అని వివేక్ తెలిపారు. జేపీఎల్ ఇతర లీగ్‌లకు ఒక ట్రెండ్‌సెట్టర్‌గా నిలవాలని, జర్నలిస్టులు అద్భుతంగా ఆడి, అందరికి ప్రేరణగా నిలవాలని భరత్ రెడ్డి ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో త్రుక్ష ఫుడ్స్ ఎండీ భరత్ రెడ్డి, లైఫ్ స్పాన్ సంస్థ స్పోర్ట్స్ హెడ్ భరణి, కేఎస్‌జీ సీఈఓ సంజయ్ (Sanjay), హెచ్‌సీఏ సీనియర్ సభ్యులు ఆగంరావు, స్మయిల్‌గార్డ్ ఫౌండర్ శరత్, జూపర్ ఎల్ఈడీ ఫౌండర్ రమేష్‌లతో పాటు పది మీడియా సంస్థల జట్లు పాల్గొన్నాయి.