ముంబై : ఇంగ్లండ్‌లో పర్యటించే భారత క్రికెట్ జట్టు బృందాన్ని ఇవాళ బీసీసీఐ(BCCI) ప్రకటించింది. మొత్తం 18 ఆటగాళ్ల జాబితాను రిలీజ్ చేశారు. అయితే ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఆడిన హర్షత్ రాణా.. సర్ఫరాజ్ ఖాన్‌కు.. ఇంగ్లండ్ టూరుకు జట్టులో చోటు దొరకలేదు. హర్షిత్ రాణా, సర్ఫరాజ్‌ను డ్రాప్ చేసినట్లు బీసీసీఐ ఇవాళ ప్రకటించింది. ఇంగ్లండ్ టూరుకు భారత జట్టు కెప్టెన్‌గా శుభమన్ గిల్‌ను నియమించారు. రిషబ్ పంత్ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు.
18 మంది సభ్యుల బృందంలో స్పీడ్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా పేరు ఉన్నా.. అతను టెస్టులు ఆడేది డౌట్‌గా ఉన్నది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. ఫిజియోథెరపిస్టు ప్రకారం బుమ్రా అయిదు టెస్టు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోవచ్చు అన్నారు. ఇక బౌలర్ షమీ విషయంలో కూడా అగార్కర్ కామెంట్ చేశారు. ప్రస్తుతం షమీ కూడా ఫిట్‌గా లేడని, అందుకే అతన్ని ఎంపిక చేయలేదన్నారు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇటీవల టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడంతో.. భారత బ్యాటింగ్ లైనప్‌లో భారీ మార్పులు చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో సెలెక్టర్లు అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఐపీఎల్లో టాప్ రన్ స్కోరర్‌గా దూసుకెళ్తున్న బీ సాయి సుదర్శన్.. టెస్టుల్లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. సెలెక్టర్లు అతన్ని ఇంగ్లండ్ సిరీస్‌కు ఎంపిక చేశారు. ఇక మిడిల్ ఆర్డర్ బ్యాటర్ కరుణ్ నాయర్ కూడా జట్టులోకి రానున్నాడు. ఏడేళ్ల తర్వాత అతను మళ్లీ జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇస్తున్నాడు.
శుభమన్‌కు నాయకత్వాన్ని అప్పగించాలని గత ఏడాది ఆలోచించామని, భారత జట్టును ముందుకు తీసుకెళ్లే వ్యక్తిగా అతను అనిపించాడని, తీవ్రమైన వత్తిడి ఉండే కెప్టెన్సీని అతను సమర్థవంతంగా నిర్వర్తించగలడని, అతనికి ఆల్ ద బెస్ట్ చెబుతున్నట్లు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తెలిపారు.