వడోదర : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో గుజరాత్ జెయింట్స్ అద్భుతం చేసింది. టోర్నీ చరిత్రలో ఇంతవరకూ తమపై ఓటమెరుగని డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌కు షాక్ ఇచ్చింది. నాకౌట్ దశకు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో జెయింట్స్.. ప్రత్యర్థిపై 11 పరుగుల తేడాతో గెలిచి ఈ టోర్నీలో తొలిసారి నాకౌట్‌కు అర్హత సాధించింది. అంతేగాక నాలుగు సీజన్లలో ముంబైతో ఆడిన 9వ మ్యాచ్‌లో జెయింట్స్‌కు ఇదే తొలి విజయం. టైటాన్స్ నిర్దేశించిన 168 పరుగుల ఛేదనలో ముంబై 156/7 వద్దే ఆగిపోయింది.
కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (48 బంతుల్లో 82 నాటౌట్, 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) వీరోచితంగా పోరాడింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్.. కెప్టెన్ ఆష్లీ గార్డ్నర్ (28 బంతుల్లో 46, 7 ఫోర్లు, 1 సిక్స్), జార్జియా వర్హెమ్ (26 బంతుల్లో 44 నాటౌట్, 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), అనుష్క శర్మ (31 బంతుల్లో 33, 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 167 రన్స్ చేసింది. 10 ఓవర్లలో 71/3తో నిలిచిన ఆ జట్టును గార్డ్నర్, జార్జియా ఆదుకుని జెయింట్స్‌కు పోరాడే స్కోరునందించారు. ఈ విజయంతో గుజరాత్ జెయింట్స్.. 10 పాయింట్లతో రెండో స్థానాన్ని పదిలం చేసుకుని ఎలిమినేటర్ మ్యాచ్‌కు అర్హత సాధించింది.
ఫిబ్రవరి 1న ఢిల్లీ, యూపీ మధ్య జరుగబోయే మ్యాచ్ ముంబై భవితవ్యాన్ని తేల్చనుంది. మరో మ్యాచ్ మాత్రమే మిగిలున్న ఈ టోర్నీలో ముంబై.. 6 పాయింట్ల (నెట్ రన్‌రేట్ +0.059)తో మూడో స్థానాన ఉండ గా ఢిల్లీ (6 పాయింట్లు, -0.164)4వ స్థానం లో, యూపీ (4 పాయింట్లు, -1.146) చివర్లో ఉంది. ఒకవేళ మ్యాచ్‌లో యూపీ గనుక గెలిస్తే.. మెరుగైన రన్‌రేట్ కారణంగా ముంబై నాకౌట్ చేరుతుంది. ఢిల్లీ గెలిస్తే గుజరాత్‌తో నేరుగా ఎలిమినేటర్ ఆడుతుంది.
గుజరాత్: 20 ఓవర్లకు 167/4 (గార్డ్నర్ 46, వర్హెమ్ 44, అమెలియా 2/26, షమ్నిమ్ 1/29);
ముంబై: 20 ఓవర్లకు 156/7 (హర్మన్‌ప్రీత్ 82*, సజన 26, సోఫీ 2/23, వర్హెమ్ 2/26)