PAK vs OMN : ఆసియా కప్ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ ఆదిలో తడబడినా భారీ స్కోర్ చేసింది. స్పిన్ ట్రాక్ మీద ఒమన్ బౌలర్ అమిర్ ఖలీం(3-31) తిప్పేయగా కీలక ఆటగాళ్లు చేతులెత్తేశారు. ఓవైపు వికెట్లు పడుతున్నా మొహమ్మద్ హ్యారిస్ (66) అర్ధ శతకంతో జట్టును ఆదుకున్నాడు. ఆఖర్లో ఫఖర్ జమాన్ (23), మొహమ్మద్ నవాజ్ (19) మెరుపులతో పాక్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. ఒమన్ బౌలర్లలో షాహ్ ఫైజల్ కూడా మూడు వికెట్లతో రాణించాడు.
టాస్ గెలిచిన పాకిస్థాన్ సారథి సల్మాన్ అఘా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలిసారి మెగా టోర్నీ ఆడుతున్న ఒమన్ బౌలర్లను ఉతికేసి కొండంత స్కోర్ కొట్టానుకున్న పాక్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ సయీం ఆయూబ్(0)ను స్పిన్నర్ అమిర్ ఖలీం వెనక్కి పంపాడు. ఆ తర్వాత షహిబ్జద ఫర్హాన్(29) జతగా మొహమ్మద్ హ్యారిస్(66) ధనాధన్ ఆడాడు. ఈ ఇద్దరూ బౌండరీలతో చెలరేగి రెండో వికెట్‌కు 85 రన్స్ జోడించారు.
A decent total for Pakistan, with Oman fighting hard in the field 💪#PAKvOMA LIVE 👉 https://t.co/tFHHXaVprD pic.twitter.com/YLEaukPGvd
— ESPNcricinfo (@ESPNcricinfo) September 12, 2025
దంచికొడుతున్న ఈ ద్వయాన్ని అమిర్ విడదీసి మళ్లీ ఒమన్‌కు బ్రేకిచ్చాడు. కాసేపటికే అర్ధ శతకం బాదిన హ్యారిస్ రివర్స్ స్వీప్ ఆడబోయి అమిర్ ఓవర్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాతి బంతికే సల్వాన్ అఘా(0) గోల్డెన్ డక్ అయ్యాడు. 120కే ఐదు వికెట్లు పడిన వేళ.. ఫఖర్ జమాన్ (23), మొహమ్మద్ నవాజ్(19)లు దూకుడుగా ఆడి జట్టు స్కోర్ 150 దాటించారు. ఆఖర్లో షాహ్ ఫైజల్ ధాటికి టెయిలెండర్లు పెవిలియన్‌కు క్యూ కట్టడంతో పాక్ 160కే పరిమితమైంది.