IPL 2025 : పొట్టి ఫార్మాట్ అంటే చాలు చెలరేగిపోయే భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya) మరో రికార్డు నెలకొల్పాడు. బ్యాటుతో విధ్వంసం సృష్టించే అతడు బంతితో విజృంభించి టీ20ల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. 2023లో న్యూజిలాండ్‌పై 16 పరుగులకే 4 వికెట్లతో రికార్డు నెలకొల్పిన అతడు.. ఈసారి 5 వికెట్లతో అదరగొట్టాడు.
టీ20 ఫార్మాట్లో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఈ పేసర్‌కు ఇదే గొప్ప ప్రదర్శన. 18వ సీజన్ లీగ్ దశలో భాగంగా లక్నో సూపర్‌జెయింట్స్(LSG)తో జరిగిన మ్యాచ్‌లో పాండ్యా ఈ ఘనత సాధించాడు. ఇప్పటివరకూ ఐపీఎల్ ఒక మ్యాచ్‌లో 3 వికెట్లకే పరిమితమైన అతడు లక్నోపై రెచ్చిపోయాడు.
Hardik Pandya 🤝 Kadak performances when needed the most 💯#MumbaiIndians #PlayLikeMumbai #TATAIPL #LSGvMIpic.twitter.com/1vs80SvCbA
— Mumbai Indians (@mipaltan) April 4, 2025
పవర్ ప్లే అనంతరం డేంజరస్ నికోలస్ పూరన్ వికెట్ పడగొట్టిన పాండ్యా.. మిడిల్ ఓవర్లలో రిషభ్ పంత్, మర్క్రమ్ వికెట్లు తీశాడు. ఇక 20వ ఓవర్లో డేవిడ్ మిల్లర్, ఆకాశ్ దీప్‌లను డగౌట్ చేర్చిన పాండ్యా 5 వికెట్ల క్లబ్లో చేరాడు. 4-0-36-5 గణాంకాలతో తానొక ఛాంపియన్ బౌలర్ అనిపించుకున్నాడు హార్దిక్. అంతేకాదు ఐపీఎల్ ఫ్రాంఛైజీ కెప్టెన్‌గా అత్యధిక వికెట్లు కూల్చిన రెండో ప్లేయర్‌గా భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే (Anil Kumble) రికార్డు సమం చేశాడు పాండ్యా. ముంబై ఇండియన్స్ సారథి అయిన అతడు 30 వికెట్లు తీయగా.. దివంగత షేన్ వార్న్ 57 వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.