కెప్టెన్‌గా తొలి ప్రయత్నంలోనే ఐపీఎల్ ట్రోఫీ సాధించిన స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. తన ఫేవరెట్ క్రికెటర్ గురించి మాట్లాడాడు. సాధారణంగా చాలామంది క్రికెటర్లు సచిన్ వంటి దిగ్గజాలను తమ ఫేవరెట్లుగా చెప్తారు. కానీ పాండ్యా మాత్రం దేశవాళీల లెజెండ్, భారత్ తరఫున ఆడే అవకాశాలు పెద్దగా రాని వసీం జాఫర్ పేరు చెప్పాడు.
జాఫర్ ఆడుతున్న సమయంలో భారత బ్యాటింగ్ లైనప్ సెహ్వాగ్, సచిన్, ద్రావిడ్, గంగూలీ, లక్ష్మణ్‌లతో బలంగా ఉండేది. దాంతో జాఫర్‌కు పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ వచ్చిన వాటిని మాత్రం జాఫర్ వృధా కానివ్వలేదు. భారత్ తరఫున కేవలం 31 టెస్టులు మాత్రమే ఆడిన ఈ ముంబై, విధర్భ రంజీ ఆటగాడు.. 11 హాఫ్ సెంచరీలు, ఐదు సెంచరీలతో ఆకట్టుకున్నాడు.
‘‘అందరిలాగే నాక్కూడా ఫేవరెట్ క్రికెటర్లు ఉన్నారు. కలిస్, విరాట్, సచిన్ అంటే నాకు చాలా ఇష్టం. కానీ నా ఫేవరెట్ క్రికెటర్ మాత్రం నిజానికి వసీం జాఫర్. తను బ్యాటింగ్ చేస్తుంటే చూడటాన్ని చాలా ఇష్టపడేవాడిని. జాఫర్ బ్యాటింగ్‌ను కాపీ కొట్టడానికి చాలా ప్రయత్నించా. కానీ ఆ క్లాస్‌ను మాత్రం అనుకరించలేకపోయా’’ అని హార్దిక్ వెల్లడించాడు.