Hardik Pandya : గాయం నుంచి కోలుకుని బ్యాట్ అందుకున్న టీ20 ప్రపంచకప్ హీరో హార్దిక్ పాండ్యా (Hardik Pandya) దంచేశాడు. వస్తూ వస్తూనే మెరుపు హాఫ్ సెంచరీతో కదం తొక్కాడీ బరోడా స్టార్. ఫిట్నెస్ సాధించి సయ్యద్ ముస్తాక్ అలీ (Syed Mushtaq Ali Trophy) ట్రోఫీలో ఆడుతున్న పాండ్యా పంజాబ్‌పై చితక్కొట్టాడు. కేవలం 42 బంతుల్లోనే 77 పరుగులతో రెచ్చిపోయిన ఈ ఆల్‌రౌండర్ టీమిండియా పునరాగమనానికి తాను సిద్ధమేనని చాటుకున్నాడు. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో పొట్టి సిరీస్‌లో ఆడడం ఖాయమనిపిస్తోంది.
టీమిండియాకు నిఖార్సైన ఆల్‌రౌండర్‌గా పేరొందిన పాండ్యా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అదరగొట్టాడు. రెండు నెలల విరామం తర్వాత మైదానంలోకి దిగిన పాండ్యా.. తొలి మ్యాచ్‌లోనే అర్ధ శతకంతో విరుచుకుపడ్డాడు. పవర్ హిట్టరైన బరోడా స్టార్ 42 బంతుల్లోనే 77 పరుగులతో తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. అతడి విజృంభణతో బరోడా 7 వికెట్ల తేడాతో పంజాబ్‌ను ఓడించింది. అర్ధ శతకంతో ఫామ్ నిరూపించుకున్న పాండ్యా జనవరి 9 నుంచి సఫారీలతో జరిగే టీ20 సిరీస్‌లో ఆడే అవకాశముంది. అయితే.. మెడ నొప్పి నుంచి కోలుకొని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో చేరిన శుభ్‌మన్ గిల్ మాత్రం అందుబాటులో ఉండడంపై సందేహాలు నెలకొన్నాయి.
Baroda’s chased The Target Aganist Punjab
Hardik Pandya Scored 77* off 42 is pure fire. 🔥
Pots In Sa Series Needed ❤️ pic.twitter.com/SMmXWwLP50— ` A R Y A N (@aryannfr) December 2, 2025
ఇటీవల ఆసియా కప్‌లో ఎడమ కాలి తొడకండరాల గాయంతో బాధపడిన పాండ్యా అక్టోబర్ 14న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో చేరాడు. నెలకుపైగా నిపుణుల సమక్షంలో బౌలింగ్ సాధన చేసిన అతడు పట్టు సాధించాడు. నవంబర్ 30న అక్కడ ఫిట్నెస్ నిరూపించుకున్న ఈ ఆల్‌రౌండర్ దేశవాళీలో ఆడేందుకు మార్గం సుగమమైంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పంజాబ్, డిసెంబర్ 4న గుజరాత్‌తో మ్యాచ్‌ల తర్వాత పాండ్యా ఫిట్నెస్ను బట్టి మరో మ్యాచ్ ఆడిస్తామని బరోడా క్రికెట్ వెల్లడించింన విషయం తెలిసిందే.
ఈ టోర్నీలో పాండ్యా బౌలింగ్, బ్యాటింగ్‌ను జాతీయ సెలెక్టర్ ప్రజ్ఞాన్ ఓజా (Pragnan Ojha) పరీశీలించనున్నాడు. పాండ్యా ఫిట్నెస్, ప్రదర్శన గురించి చీఫ్ సెలెక్టర్‌కు అతడు రిపోర్టు ఇవ్వనున్నాడు. అప్పుడు అంతా ఒకే అనిపిస్తే.. సఫారీలతో టీ20 సిరీస్‌లో పాండ్యా ఆడినా ఆశ్చర్యం అక్కర్లేదు. డిసెంబర్ 9 నుంచి భారత్, దక్షిణాఫ్రికా మధ్య పొట్టి సిరీస్ మొదలవ్వనుంది. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ సన్నద్ధతలో ఉన్న టీమిండియాకు పాండ్యా పునరాగమనం బిగ్ బూస్ట్ కానుంది.
A Pandya comeback is on the cards: https://t.co/SE4XjSYqJC 🏏 pic.twitter.com/za1PJhPMa4
— ESPNcricinfo (@ESPNcricinfo) December 2, 2025
నిరుడు పొట్టి వరల్డ్ కప్ విజేతగా స్వదేశం వచ్చిన పాండ్యా.. భార్య నటాషా స్టాంకోవిచ్‌కు విడాకులు ఇచ్చేశాడు. నాలుగేళ్ల తమ వివాహ బంధానికి ముగింపు పలికిన అతడు.. మరో అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు. మోడల్, అస్సామీ నటి అయిన మహీకా శర్మ (Mahieka Sharma) తో అతడు ఎఫైర్ సాగిస్తున్నాడు. వీరిద్దరూ గత కొంత కాలంగా తరచూ మీడియా కంటపడుతున్నారు. మరి. ఈ క్యూట్ జంట పెళ్లి కబురు ఎప్పుడు చెబుతారోనని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.