న్యూఢిలీ : తరచూ గాయాలు, ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బందిపడుతున్న టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. తన పర్మనెంట్ ట్రైనింగ్ బేస్‌గా బెంగళూరును ఎంచుకున్నాడు. అక్కడి బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)లోనే ఇకపై శిక్షణ తీసుకోనున్నాడు.
ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న ఓ భారత క్రికెటర్ సీఓఈని తన పర్మనెంట్ బేస్‌గా మార్చుకోవడం ఇదే తొలిసారి. సాధారణంగా సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్లు గాయాల నుంచి కోలుకోవడానికి, ఫిట్నెస్ పరీక్షలు, క్యాంప్‌ల కోసమే సీఓఈకి వస్తుంటారు. 32 ఏండ్ల హార్దిక్ గత దశాబ్ద కాలంగా ముంబైలోనే నివసిస్తున్నాడు. ఇకపై ఐపీఎల్, అంతర్జాతీయ మ్యాచ్‌లు లేని టైమ్‌లో పూర్తిగా బెంగళూరులోనే ఉండి శిక్షణ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.