Hardhik Pandya : టీ20 వరల్డ్ కప్ హీరో హార్దిక్ పాండ్యా(Hardhik Pandya) టెస్టుల్లో పునరాగమనంపై కన్నేశాడు. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ స్క్వాడ్‌కు ఎంపికవ్వని పాండ్యా ఇప్పుడు రెడ్ బాల్ క్రికెట్‌పై దృష్టి పెట్టాడు. 2018లో ఆఖరి టెస్టు మ్యాచ్ ఆడిన అతడు మళ్లీ తెలుపు జెర్సీ వేసుకోవాలనే కసితో ఉన్నాడు. అందులో భాగంగానే ఈ ఆల్‌రౌండర్ బరోడా(Baroda) జట్టు తరఫున దేశవాళీ క్రికెట్ ఆడేందుకు సిద్దమవుతున్నాడు. తాజాగా అతడు నెట్స్‌లో బ్యాటింగ్, బౌలింగ్ సాధన చేస్తూ కనిపించాడు. 2018లో బరోడాకు ఆడిన పాండ్యా దాదాపు ఐదేండ్ల విరామం తర్వాత మళ్లీ ఆ జట్టుతో కలుస్తాడని సమాచారం.
టెస్టు జట్టులోకి రావాలంటే పిట్నెస్ నిరూపించుకోవాలి. అందుకని దేశవాళీలో కొన్ని మ్యాచ్‌లు ఆడాల్సిందేనని ఈ ఏడాది బీసీసీఐ అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే. అందుకనే పాండ్యా టెస్టు జట్టులో చోటు కోసం దేశవాళీ క్రికెట్‌ను నమ్ముకున్నాడు. ఫస్ట్ క్లాస్ సీజన్ 2024-25లో హార్దిక్ మళ్లీ బరోడాకు ఆడే అవకాశముంది. బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్ ముగిశాక టీమిండియా స్వదేశంలోనే న్యూజిలాండ్‌తో మూడు టెస్టులు ఆడనుంది.
అనంతరం నవంబర్‌లో బోర్డర్గ – వాస్కర్ ట్రోఫీకోసం రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు ఆస్ట్రేలియా వెళ్లనుంది. అక్కడ ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆసీస్‌తో టీమిండియా తలపడనుంది. ఈ రెండు సిరీస్‌లకు అందుబాటులో ఉండడం కోసం పాండ్యా బరోడా తరఫున దేశవాళీ మ్యాచ్‌లు ఆడాలని నిర్ణయించుకున్నాడు. అయితే.. రంజీ సీజన్ ఆరంభానికి ఇంకో నెల మాత్రమే ఉంది. అక్టోబర్ 11న మొదలయ్యే తొలి పోరులోనే డిఫెండింగ్ చాంపియన్ ముంబైతో బరోడా తలపడనుంది. ఆ తర్వాత ఐదు రోజులకే న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ఉంది. సో.. పాండ్యా అద్భుతంగా రాణిస్తే తప్పు జాతీయ జట్టులోకి రావడం కష్టం.
పాండ్యా, నటాషా స్టాంకోవిక్
టీ20 వరల్డ్ కప్ విజేతగా భారత్‌కు వచ్చిన పాండ్యా భార్య నటాషా స్టాంకోవిక్(Natasha Stankovic)కు విడాకులు ఇచ్చేశాడు. నాలుగేండ్ల తమ వివాహ బంధం ముగిసిందంటూ భావోద్వేగ సుదీర్ఘ పోస్ట్ పెట్టాడు. ఈ జంటకు ‘అగస్త్య’ అనే కుమరుడు ఉన్నాడు. ‘మేము విడిపోయినా కూడా తల్లిదండ్రులుగా అతడికి ప్రేమ పంచుతామ’ని పాండ్యా తెలిపాడు.