గురువారం 29 అక్టోబర్ 2020
Sports - Oct 01, 2020 , 21:31:10

KXIP vs MI: పొలార్డ్‌, పాండ్య మెరుపులు..ముంబై భారీ స్కోరు

KXIP vs MI: పొలార్డ్‌, పాండ్య మెరుపులు..ముంబై భారీ స్కోరు

అబుదాబి: ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(70: 45 బంతుల్లో 8ఫోర్లు, 3సిక్సర్లు)  మరోసారి  ఉత్తమ ప్రదర్శనతో అదరగొట్టాడు. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో మ్యాచ్‌లో అద్భుత అర్ధశతకంతో రాణించడంతో ముంబై నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లకు 191 పరుగులు చేసింది.  ఆఖర్లో హార్దిక్‌ పాండ్య(30 నాటౌట్‌: 11 బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లు ), పొలార్డ్‌(47 నాటౌట్:‌ 20 బంతుల్లో  3ఫోర్లు, 4సిక్సర్లు ) ధనాధన్‌ బ్యాటింగ్‌తో మెరుపులు మెరిపించారు.  ఆరంభంలో నిదానంగా సాగిన ఇన్నింగ్స్‌కు వీరిద్దరూ అదిరిపోయే ముగింపునిచ్చారు.  ఇషాన్‌ కిషాన్‌(28) ఫర్వాలేదనిపించాడు. 15 ఓవర్ల వరకు ముంబైని కట్టడి చేసిన పంజాబ్‌  చివర్లో తేలిపోయింది. పంజాబ్‌ బౌలర్లలో కాట్రెల్‌, షమీ, గౌతం తలో వికెట్‌ తీశారు. 

 టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి ఆరంభం లభించలేదు.    మొదటి ఓవర్‌లోనే   పేసర్‌  షెల్డన్‌ కాట్రెల్‌   సంచలన బౌలింగ్‌తో షాక్‌ ఇచ్చాడు.  ఐదో బంతికి ముంబై ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌(0)ను బౌల్డ్‌ చేశాడు.  ముంబై కనీసం పరుగులు ఖాతా తెరవకుండానే వికెట్‌ చేజార్చుకుంది. యువ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ వేసిన నాలుగో ఓవర్లో కీలక ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ రనౌటయ్యాడు. ఐదో బంతిని రోహిత్‌ వికెట్ల వెనకకు షాట్‌ ఆడి పరుగు కోసం ప్రయత్నించాడు. మమ్మద్‌ షమీ విసిరిన డైరెక్ట్‌ త్రోకు వికెట్ల మధ్య  నిర్లక్ష్యంగా  పరుగెత్తిన  సూర్యకుమార్‌ బలయ్యాడు. స్వల్ప స్కోరుకే ముంబై రెండు వికెట్లు కోల్పోయిన స్థితిలో ఒంటరిపోరాటం చేస్తూ జట్టును ఆదుకున్నాడు.  వీలుచిక్కినప్పుడల్లా  బౌండరీలు బాదుతూ ఇన్నింగ్స్‌ను ముందుండి నడిపించాడు. 

మరో ఎండ్‌లో యువ బ్యాట్స్‌మన్‌ కిషన్‌ మంచి సహకారం అందించాడు. రోహిత్‌, ఇషాన్‌  50కి పైగా పరుగుల భాగస్వా్మ్యాన్ని నెలకొల్పి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు.   ప్రమాదకరంగా మారుతున్న  ఈ జోడీని స్పిన్నర్‌   గౌతం విడదీశాడు.  14వ ఓవర్‌ మొదటి బంతికి కిషన్‌..నాయర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.  ఈ క్రమంలోనే  రోహిత్‌  40  బంతుల్లో 7ఫోర్లు, సిక్స్‌ సాయంతో అర్ధశతకం పూర్తి చేశాడు. జేమ్స్‌ నీషమ్‌ వేసిన 16వ ఓవర్‌ రెండో బంతికి ఫోర్‌ కొట్టి 50 మార్క్‌ చేరుకున్నాడు.   ఆ ఓవర్‌లోనే హిట్‌మ్యాన్‌  వరుసగా 4,4,6,6 బాది 22 పరుగులు రాబట్టాడు. 

షమీ వేసిన  తర్వాతి ఓవర్‌ తొలి బంతికే రోహిత్‌ పెవిలియన్‌ చేరడంతో స్కోరు వేగం కాస్త తగ్గింది. నీషమ్‌ వేసిన 18వ ఓవర్లో హార్దిక్‌ పాండ్య సిక్స్‌, రెండు ఫోర్లు బాదడంతో 18 రన్స్‌ వచ్చాయి.  ఆ తర్వాత షమీ  వేసిన 19వ ఓవర్లో పాండ్య ఒక ఫోర్‌  బాదగా..పొలార్డ్‌ మూడు  బౌండరీలు బాది 19 పరుగులు రాబట్టారు.  గౌతం వేసిన ఇన్నింగ్స్‌ ఆఖరి  ఓవర్లో  రెండో బంతికి పాండ్య సిక్స్‌ కొట్టాడు.. ఆఖరి మూడు బంతుల్లో పొలార్డ్‌ వరుసగా సిక్సర్లు బాది స్కోరును 190 దాటించాడు.  ఐదో వికెట్‌కు ఈ జోడీ 23 బంతుల్లో 67 రన్స్‌ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.  


logo