Harbhajan Singh : ఈడెన్ గార్డెన్స్‌లో భారత జట్టు అనూహ్య ఓటమిపై.. టర్నింగ్ పిచ్‌ను కోరడంపై విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రత్యర్ధిని బోల్తా కొట్టించబోయి టీమిండియా క్రికెటర్లే బొక్కబోర్లాపడడం, స్వదేశంలో పరాజయం పాలవ్వడాన్ని మాజీలు తేలికగా తీసుకోలేకపోతున్నారు. టెస్టు క్రికెట్ భవిష్యత్‌ను నాశనం చేస్తున్నారంటూ కోచ్ గౌతం గంభీర్, బీసీసీఐను కడిగిపారేస్తున్న హర్భజన్ సింగ్ (Harbhajan Singh) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత పిచ్‌లపై విమర్శనాస్త్రాలు సంధించిన అతడు.. ఇప్పుడు దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీలు సైతం వికెట్ కాపాడుకోలేరని భజ్జీ అంటున్నాడు.
కోల్‌కతా టెస్టులో స్వల్ప లక్ష్యాన్ని భారత జట్టు ఛేదించలేకపోవడం తీవ్ర దుమారం రేపుతోంది. పట్టుబింగినట్టే బిగించి.. మ్యాచ్‌ను చేజేతులా దక్షిణాఫ్రికాకు అప్పగించిన తీరు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదంటున్నాడు హర్భజన్ సింగ్. ఈడెన్ గార్డెన్స్ పిచ్‌పై మండిపడుతున్న ఈ లెజెండరీ స్పిన్నర్ యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ సంచలన కామెంట్లు చేశాడు.

‘టెస్టు క్రికెట్ ఇప్పటికే చచ్చిపోయింది. ఇప్పటికీ సుదీర్ఘ ఫార్మాట్లో మజా ఉందని నేను అనుకోవడం లేదు. భారత టెస్టు క్రికెట్లో కూడా జీవం లేదని నా అభిప్రాయం. ఇంగ్లండ్‌లో మ్యాచ్‌లు అద్భుంగా జరిగాయి. అక్కడ పిచ్‌లు సవాల్ విసరడం.. మన కుర్రాళ్లు గొప్పగా ఆడి మ్యాచ్‌లు గెలవడాన్ని అందరం ప్రశంసించాం. నిజమైన టెస్టు క్రికెట్ అంటే అదే. ఆ ఆటలో థ్రిల్ ఉంటుంది. ఆటగాళ్లే కాదు మనం కూడా పోరాడినట్టుగా ఫీలవుతాం. కానీ, మనదేశంలోని పిచ్‌లు మాత్రం మరీ దారుణం. ఇక్కడ బౌలింగ్ చేస్తే బంతి అనూహ్యంగా టర్న్ అవుతోంది. బ్యాటర్లకు ఏం చేయాలో అర్ధం కావడం లేదు. టెక్నిక్ ఎంత బాగన్నా సరే ఔటవుతున్నారు.

అంతెందుకు.. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీలు సైతం ఇప్పుడు మన పిచ్‌లపై వికెట్ కాపాడుకోలేరు. ఎందుకంటే.. ఒక బంతి బౌన్స్ అయితే.. మరో బంతి స్లోగా వస్తోంది. ఆ తర్వాతి బంతి నమ్మశక్యంకాని విధంగా టర్న్ అవుతోంది. అంతే.. బ్యాటర్లు వికెట్ కోల్పోతున్నారు. ఇలాంటి అర్ధం కాని వికెట్ మీద వారి టెక్నిక్ పని చేయడం లేదు. ఆటగాళ్ల పొరపాట్లు కాదు పిచ్ ఒక్కటే అన్నీ నిర్ణయిస్తోంది. ఇది మనదేశంలో కొత్తేమీ కాదు. ఏళ్లుగా ఇలానే కొనసాగుతోంది’ అని భజ్జీ పేర్కొన్నాడు.
స్వదేశంలో నిరుడు (2024 నవంబర్) న్యూజిలాండ్ చేతిలో భారత జట్టు వైట్‌వాష్ అయింది. స్పిన్ వికెట్‌తో కివీస్‌కు షాకివ్వాలనుకున్న రోహిత్ శర్మ బృందం చివరకు అనూహ్యంగా ఓటమి పాలైంది. అప్పటి నుంచి మన పిచ్‌లపై రాద్దాంతం నడుస్తోంది. ఇప్పుడు ఈడెన్ గార్డెన్స్‌లో మూడు రోజుల్లోనే మ్యాచ్ ముగియడం.. టీమిండియా చేజేతులా ఓడడంతో మళ్లీ టర్నింగ్ వికెట్లపై చర్చ జరుగుతోంది.